Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతికి సుప్రీంకోర్టు మరోసారి మద్దతుగా నిలిచింది. పద్మావతిపై రోజురోజుకీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పద్మావతిని నిషేధించాలంటూ వేసిన పిటిషన్ ను మూడోసారి తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం సినిమాను ప్రదర్శించాలా..వద్దా అన్నది సెన్సార్ బోర్డపై ఆధారపడిఉంటుందని తెలిపింది. సినిమాను వ్యతిరేకిస్తూ… తమ రాష్ట్రాల్లో నిషేధం విధించిన ముఖ్యమంత్రులపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. బాధ్యతగల పదవుల్లో ఉన్న వారు ఇలాంటి సున్నితమైన అంశాలపై కామెంట్లు చేయకూడదని హెచ్చరించింది.
సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వాలా వద్దా అన్న అంశంపై నేతలు ఎలా వ్యాఖ్యలు చేస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పద్మావతి డిసెంబరు 1న విడుదల కావాల్సి ఉండగా…రాజ్ పుత్ కర్ణిసేన ఆందోళనలు. సీబీఎఫ్ సీ సర్టిపికెట్ ఇవ్వడం ఆలస్యం అయిన నేపథ్యంలో వాయిదా పడింది.
సినిమాను నిర్మాణ దశనుంచే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజ్ పుత్ కర్ణిసేన.. షూటింగ్ ముగింపు దశకు వచ్చేసరికి తమ ఆందోళనలు ఉదృతం చేసింది. పద్మావతిలో రాజ్ పుత్ లను అవమానించే సన్నివేశాలు ఉన్నాయని కర్ణిసేన ఆరోపిస్తుండడంతో.రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధించాయి.
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, చెన్నై వంటి దక్షిణాది నగరాల్లోనూ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి . అంతేకాక పద్మావతి హీరోయిన్ దీపికా పదుకునే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలకు వెలకట్టేదాకాఆందోళనలు పెచ్చుమీరాయి. దీనిపై విమర్శలు వ్యక్తమయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు భన్సాలీ రాజకుటుంబీకులు, కర్ణిసేన సంఘాలతో చర్చిస్తే..పరిష్కారం దొరుకుతుందని పలువురు సూచిస్తున్నారు.