సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా పనిచేసిన తెలుగు వ్యక్తి నాగేశ్వరరావుకి సుప్రీంకోర్టు మళ్లీ షాకిచ్చింది. బీహార్ వసతి గృహాల్లో వేధింపుల కేసులో అక్షింతలు వేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీం కోర్టు వింత శిక్ష విధించింది. రూ.లక్ష జరిమానా విధించడంతో పాటూ కోర్టు బెంచ్ లేచే వరకు కోర్టు గదిలో ఓ మూల కూర్చోవలసిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు. నాగేశ్వరరావు లీగల్ అడ్వైజర్‌కు కూడా జరిమానాతో పాటూ అదే శిక్ష విధించింది. బీహార్ లోని ప్రభుత్వ వసతి గృహాల్లో బాలికలపై లైంగిక దాడి ఘటనలపై సీబీఐ విచారణ జరుపుతుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని తమ అనుమతి లేకుండా మార్చవద్దని గతంలో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పుకు విరుద్ధంగా విచారణ అధికారి ఏకే శర్మను నాగేశ్వరరావు బదిలీ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు తమ ఉత్తర్వులు ఉల్లంఘించారంటూ నాగేశ్వరరావుకి నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఆయన స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. క్షమాపణ కోరుతూ అఫడివిట్ దాఖలు చేశారు. ‘నా తప్పును అంగీకరిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నా ఏకేశర్మ బదిలీ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం, ఉల్లంఘన అవుతుందని కలలో కూడా ఊహించలేదు. కోర్టు అనుమతి లేకుండా ఆ బదిలీ చేసి ఉండాల్సింది కాదని అందులో తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను జస్టిస్ రంజన్ గగోయ్ తోసిపుచ్చారు. నాగేశ్వరరావుకు లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతే కాకుండా ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి. కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు వెళ్లి కోర్టు గదిలో ఓ పక్కన కూర్చోండి అని ఆదేశించారు. వారం రోజుల్లో జరిమానా మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించారు.