Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేరళ లవ్ జీహాద్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి ఎంపికలో తప్పొప్పులను తాము చెప్పలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఫలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలని, ఫలానా వ్యక్తిని వద్దని కోర్టు నిర్ణయించలేదని వ్యాఖ్యానించింది.కేరళకు చెందిన 25ఏళ్ల హదియా ఇస్లాంలోకి మారి ముస్లింయువకుడిని వివాహం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వివాహం చెల్లదని గత ఏడాది కేరళ హైకోర్టు తీర్పు ఇవ్వగా..హదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఓ వ్యక్తి తన భాగస్వామి ఎంపిక విషయంలో కోర్టు న్యాయం చెప్పలేదని, మేజర్ అయిన వ్యక్తి తన నిర్ణయం ప్రకారం వివాహం చేసుకోవచ్చని స్ఫష్టంచేసింది. పెళ్లి విషయంలో మంచి, చెడులను కూడా తాము చెప్పలేమని, వారు ఎంపిక చేసుకున్న వ్యక్తి వారికి సరిపోవడం, సరిపోకపోవడం, వారి ఎంపిక సరైనదా…కాదా…వంటి విషయాలను కోర్టు తీర్మానించలేదని తెలియజేసింది.
సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోలేదనే కారణంతో వారి వివాహాన్ని రద్దుచేయలేమని, ఇద్దరు మేజర్ల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. హదియా తన ఇష్టప్రకారమే మతం మార్చుకుని పెళ్లిచేసుకున్నానంటున్నారని, ఆమె ఆ విధంగా చెప్పినప్పుడు ఇక ఆమె వివాహం చెల్లదని ఎలా చెప్పగలమని ప్రశ్నించింది. పెళ్లి, విచారణ రెండు వేర్వేరు అంశాలని, దేనిపైనైనా విచారణ చేయవచ్చు కానీ..పెళ్లిపై విచారణ జరపలేమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. హదియా కేసులో వాదనలు ముగియకపోవడంతో తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.