Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అయినదానికీ, కానీ దానికీ కేంద్రంతో కయ్యానికి దిగుతున్న మమతాబెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పలు సంక్షేమ పథకాలకు ఆధార్ ను అనసంధానించిన కేంద్రప్రభుత్వం బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు కూడా ఆధార్ ను తప్పనిసరి చేసింది. ప్రతి వినియోగదారుడు మొబైల్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేయాలని ఫోన్లకు సందేశాలొస్తున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ… ఇటీవలే తన ఫోన్ నెంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని తేల్చిచెప్పారు.
అంతటితో ఆగకుండా… రాష్ట్రప్రభుత్వం తరపున దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. పశ్చిమ బంగ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది, కేంద్రమాజీ మంత్రి కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు ఎలా పిటిషన్ వేస్తాయని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పార్లమెంట్ ఆదేశాలను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా సవాలు చేస్తుందని, దీనిపై వివరణ ఇవ్వాలని సూచించింది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యక్తులు పిటిషన్ వేయొచ్చు కానీ రాష్ట్రాలు వేయకూడదని తెలిపింది. మమతా బెనర్జీ వ్యక్తిగతంగా పిటిషన్ వేస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఇదే అంశంపై మరో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీచేసింది. మొబైల్ నంబర్ కు ఆధార్ ను అనసంధానం చేయడంపై నాలుగువారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. టెలికాం ఆపరేటర్లనూ వివరణ అడిగింది.