ప‌ద్మావ‌త్ పై నిషేధం చెల్ల‌దు

supreme court suspends ban orders padmaavat movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌ద్మావ‌త్ విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. దేశ‌వ్యాప్తంగా సినిమా విడుద‌ల‌కు సుప్రీంకోర్టు అనుమ‌తిచ్చింది. బీజేపీపాలిత రాష్ట్రాలు విధించిన నిషేధాన్ని అత్యున్న‌త‌ న్యాయ‌స్థానం స‌స్పెండ్ చేసింది. నిషేధించిన రాష్ట్రాల్లో కూడా విడుద‌ల చేయాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. సెన్సార్ బోర్డు నుంచి యూఏ స‌ర్టిఫికెట్ రావ‌డంతో ప‌ద్మావ‌త్ ను ఈ నెల 25న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే ప‌ద్మావ‌త్ కు సెన్సార్ బోర్డు అనుమ‌తినిచ్చినా..తాము మాత్రం అనుమ‌తించ‌బోమ‌ని ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్ర‌క‌టించాయి. ప‌ద్మావ‌తి విడుద‌ల‌పై నిషేధం విధించాయి. దీంత చిత్ర నిర్మాత‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ అంశాన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన చీఫ్ జ‌స్టిస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏ కార‌ణంగా సినిమాను నిషేధించార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించారు.

రాష్ట్రాల నిర్ణ‌యం త‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌న్నారు. చిత్తోర్ రాణి ప‌ద్మిణి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ప‌ద్మావ‌త్ నిర్మాణం ద‌శ నుంచే ఇబ్బందులు ఎదుర్కొంది. రాజ్ పుత్ ల చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని ఆరోపిస్తూ రాజ్ పుత్ క‌ర్ణిసేన చిత్ర షూటింగ్ ను అడ్డుకుంది. చిత్ర యూనిట్ పై దాడులు సైతం జ‌రిగాయి. ఇలాంటి అవాంత‌రాలను అధిగ‌మించి షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబ‌ర్ 1న రిలీజ్ కు సిద్ధ‌మ‌వ‌గా ఉత్త‌రాది రాష్ట్రాల్లో రాజ్ పుత్ క‌ర్ణిసేన భారీ ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించింది. ఈ నేప‌థ్యంలో సెన్సార్ బోర్డు క‌న్నా ముందు ప‌ద్మావ‌త్ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ మీడియాకు ప్ర‌ద‌ర్శించారు. దీనిపై సెన్సార్ బోర్డు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.

సినిమాలో రాజ్ పుత్ ల‌ను కించ‌ప‌రిచే ఎలాంటి స‌న్నివేశాలు లేవ‌ని తెలియ‌జేసేందుకే మీడియాకు ముందుగా ప్ర‌ద‌ర్శించాల్సి వ‌చ్చింద‌ని భ‌న్సాలీ వివ‌ర‌ణ ఇచ్చినా ఫ‌లితం లేక‌పోయింది. సినిమా విడుద‌ల‌కు అనుమ‌తి నిరాక‌రించింది. త‌ర్వాత దీనిపై పార్ల‌మెంట‌రీ ప్యానెల్ క‌మీటీ ఎదుట హాజ‌రై భ‌న్సాలీ వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో అప్ప‌టిదాకా ప‌ద్మావ‌తిగా ఉన్న సినిమా పేరును ప‌ద్మావ‌త్ గా మార్చాల‌ని ఆదేశించి సెన్సార్ బోర్డ్ విడుద‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది. అడ్డంకుల‌న్నీ దాటుకుని రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతుండగా…. ఆరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిషేధం విధించ‌డంతో చిత్ర యూనిట్ సుప్రీంకోర్టుకు వెళ్లి విజ‌యం సాధించింది.