ప‌దిత‌రాల‌కు చెందిన వంశ‌స్థులంతా ఒకే చోట‌..

Director Raja Vannemreddy met in a group of ten families

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ పిల్ల‌ల‌కు , తండ్రి త‌రం, తాత త‌రం మిన‌హా అంత‌కుముందువారి సంగ‌తులు ఏమీ తెలియ‌వు. పల్లెటూళ్ల‌లో పెరిగిన పిల్ల‌ల‌కు ముత్తాత ఉంటార‌ని తెలిసిన‌ప్ప‌టికీ న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఉండే పిల్ల‌ల‌కు అస‌లు ముత్తాత అన్న ప‌ద‌మే తెలియ‌దు. నాన్న‌, తాత‌య్య వ‌ర‌కే వారి అనుబంధం ప‌రిమితం. పెద్ద‌లు సైతం ఈ ప‌రిధిలోపే త‌మ చుట్ట‌రికాల‌ను కొన‌సాగిస్తున్నారు. పెళ్లిళ్లు, పుట్టిన‌రోజులు వంటి ప్రత్యేక కార్య‌క్ర‌మాల‌కు ద‌గ్గ‌రివారిని మాత్ర‌మే ఆహ్వానిస్తున్నారు. ఈ కాలంలో చుట్టాలంటే రెండు త‌రాల‌కు చెందిన వారే. వేలు విడిచిన మేన‌మామ… వంటి బంధుత్వాలు ఇప్పుడెక్క‌డా క‌నిపించ‌డం లేదు.

పండుగ‌ల‌కు, ప‌బ్బాల‌కు క‌లుసుకోవ‌డం మాట అటుంచి ఎవ‌రు ఎక్క‌డ ఉన్నారు… ఏం చేస్తున్నారు వంటి క‌నీస వివ‌రాలు కూడా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. కానీ తాత, ముత్తాత‌ల మూలాలు, వారి బంధుత్వాలు ఎక్క‌డ ఉన్నాయో ఆరా తీసి వారందరూ ఒక‌చోట క‌లుసుకుంటే ఎంత బాగుంటుంది. ఎంతో క‌ష్ట‌సాధ్య‌మైన ఈ ప‌ని చేసి చూపించారు ద‌ర్శ‌కుడు రాజా వ‌న్నెంరెడ్డి. వ‌న్నెంరెడ్డి వంశ‌వృక్షాన్ని వెలికితీసిన ఆయ‌న మూడు రాష్ట్రాల్లో స్థిర‌ప‌డిన త‌మ ర‌క్త‌సంబంధీకులంద‌రినీ క‌లిపి ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హించారు. ఒక‌త‌రం, రెండు త‌రాలు కాదు…ఏకంగా ప‌ది త‌రాలకు చెందిన బంధువులందరినీ ఒకచోట‌కు చేర్చారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి స‌మీపంలోని చిలుకూరు ఇందుకు వేదికైంది. 370 సంవ‌త్స‌రాల క్రితం కృష్ణాజిల్లా చిన‌క‌ర‌గ్ర‌హారం చినకేరి ప్రాంతానికి చెందిన వ‌న్నెంరెడ్డి కుటుంబీకులు కొంద‌రు చిలుకూరొచ్చి స్థిర‌ప‌డ్డారు. రాజా వ‌న్నెంరెడ్డి వారిలో ప‌దో త‌రానికి చెందిన వారు. వ‌న్నెంరెడ్డి వారి ఇల‌వేల్పు పైడ‌మ్మ అమ్మ‌వారి జాత‌ర‌ను రెండేళ్ల‌కోసారి నిర్వ‌హిస్తున్నారు.

కొత్త ఆల‌యం కూడా నిర్మించారు. వ‌న్నెంరెడ్డి వంశానికి ఇల‌వేల్పు అయిన అమ్మ‌వారి జాత‌ర‌లో ఆ వంశ‌స్థులు అంద‌రూ పాల్గొంటే బాగుంటున్న ఆలోచ‌న రాజాకు క‌లిగింది. ఇందుకోసం ఈ సారి ఉత్స‌వాలకు వ‌న్నెంరెడ్డి వంశ‌స్థులంద‌రినీ పిల‌వాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. గ‌త సెప్టెంబ‌ర్ నుంచి ఇందుకోసం ప్ర‌యత్నాలు ప్రారంభించారు. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి తాత ముత్తాత‌ల వివ‌రాలు సేక‌రించారు. త‌మ ర‌క్త‌సంబంధీకులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌, త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డ్డార‌ని తెలుసుకుని వారంద‌రినీ ఉత్స‌వాల‌కు ఆహ్వానించారు. ఆయ‌న ఆహ్వానం అందుకున్న బంధువులంతా ఎంతో ఉద్వేగంగా జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చారు. అంద‌రూ క‌లిసి అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఒక‌రినొక‌రు ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకుంటూ త‌మ మూల‌లు తెలుసుకున్నారు. ఇన్నేళ్ల త‌రువాత వంశ‌స్థులంద‌రూ ఒక‌చోట క‌లుసుకోవ‌డంపై సంతోషం వ్య‌క్తంచేశారు.