టీడీపీ గూటికి వైఎస్ నీడ !

Sureedu To Join In TDP

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయులు అంటే ఠక్కున ఇద్దరు వ్యక్తుల పేర్లు గుర్తొకొచ్చేవి. అందులో ఒకటి వైఎస్ ఆత్మ కేవీపీ కాగా రెండు వైఎస్ నీడ సూరీడు. వైఎస్ మరణాంతరం కేవీపీ కాంగ్రెస్ లోనే కొనసాగుతూ అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తూ వైఎస్ గురించి మాట్లాడుతూ, కాస్త జగన్ కు ఫేవర్ గా ఉన్నట్టు కనిపిస్తూ వస్తున్నారు. ఇక సూరీడు విషయానికొస్తే అప్పట్లో ఎప్పుడూ వైఎస్ పక్కనే ఉంటూ వైఎస్ నీడగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన వైఎస్ మరణానంతరం అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. కారణాలేంటో తెలీదు కానీ ఆయన వైఎస్ కుటుంబానికి, సన్నిహితులకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడు మరోమారు సూరీడు పేరు తెర మీదకు వచ్చింది.

దానికి కారణమా ఆయన త్వరలో టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన్ని తెలుగుదేశంలో చేరేలా మంత్రి ఆదినారాయణ రెడ్డి రంగంలోకి దిగి పావులు కదిపారని సూరీడు కూడా టీడీపీలో చేరడానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి కొద్దిరోజుల్లో ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. కుదిరితే ఆయనకు కడప జిల్లాలో ఏదో ఒక టికెట్ ఇస్తారని అంటున్నారు. ఒక వేళ నిజంగానే ఆయన తెలుగుదేశం గూటికి చేరితే అది వైఎస్ జగన్ కి గట్టి దెబ్బ అనే చెప్పాలి. వైఎస్ బ్రతికున్నప్పుడు వైఎస్ నీడగా పేరు తెచ్చుకున్న సూరీడు వైసీపీని కాదని టీడీపీలో చేరితే వైఎస్ అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఎన్నికల సమయంలో ఏ నిముషానికి ఏమి జరుగుతుందో ఏమో అని ఉత్కంటగా మారింది.