సక్సెస్‌ఫుల్ దర్శకుల వెంట పడడం నిర్మాతలకి అలవాటు. సక్సెస్‌లో వున్న దర్శకుడితో సినిమా అయితే ఈజీగా సేల్ అయిపోతుందని అనుకుంటారు. కానీ సక్సెస్ ఇచ్చిన దర్శకులు మాట వినరు. నిర్మాత ఏమి చెప్పినా దానికి ఎదురు వెళతారు. అదీ కాక హిట్ ఇచ్చామనే అహంభావంతో పలుమార్లు తప్పులు చేస్తుంటారు. పైగా హిట్ ఇచ్చిన దర్శకుడి మార్కెట్ రేట్ చాలా ఎక్కువ.
దాని వల్ల బడ్జెట్ చాలా పెరుగుతుంది. అందుకే సురేష్‌బాబు తన వద్దకి ఫ్లాప్ డైరెక్టర్లని మాత్రమే ఆహ్వానిస్తున్నాడు. ప్రూవ్డ్ డైరెక్టర్ అయి వుండీ ఇప్పుడు ఫ్లాప్‌లో వున్న డైరెక్టర్ అయితే సురేష్‌బాబుకి తాను కోరుకున్నట్టుగా సినిమా తీసుకునే వీలుంటుంది. అదీ కాక ఎలాగయినా హిట్ ఇవ్వాలనే కసితో ఆ దర్శకుడు కూడా పని చేస్తుంటాడు కాబట్టి అది కూడా కలసి వస్తుంది.
అందుకే అసురన్ రీమేక్ చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించినా కానీ కనుమరుగైన శ్రీకాంత్ అడ్డాలకి ఛాన్స్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తనకి కావాల్సిన విధంగా సురేష్‌బాబు మలచుకుంటున్నారు. బ్రహ్మూత్సవం తర్వాత వచ్చిన ఛాన్స్ కావడంతో నారప్ప పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎలాగయినా సక్సెస్ చేయాలని శ్రీకాంత్ అడ్డాల గట్టిగా కృషి చేస్తున్నాడు.