Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీహార్ అధికార పక్షనేతలు ప్రజలకు సలహాలు ఇవ్వడంతో సరిపెట్టడం లేదు. స్వయంగా వాటిని ఆచరించి చూపిస్తున్నారు. బీహార్ లో వరకట్న వేధింపులకు ఎంతోమంది యువతులు బలైపోతుండడంతో ఆ రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. వరకట్నం వ్యతిరేక ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. అందులో భాగంగా వరకట్నాన్ని నిషేధిస్తున్నట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. కట్నం తీసుకోని వాళ్లే తనను పెళ్లికి పిలవాలని కూడా ఆయన చెప్పారు. సాధారణంగా ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఏవో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ… ఆ మార్పును తమ సొంత వ్యవహారాల్లో కనిపించనివ్వరు. ఒక్క బీహార్ ప్రభుత్వమే కాదు… దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వరకట్నానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తుంటాయి. కానీ రాజకీయ నేతలందరూ తమ కుటుంబంలో పెళ్లిళ్ల విషయం వచ్చేసరికి దాన్ని పక్కనపెడతారు. కూతుళ్లకు కోట్ల కట్నం ధారబోసి పెళ్లిచేయడంతో పాటు… వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. పెళ్లిమండపాలు, వధూవరుల వి వాహ వస్త్రాలు, రకరకాల వంటకాలతో విందుల కోసం మంచినీళ్లప్రాయంలా డబ్బులు ఖర్చుపెడతారు. వివాహం ఎంత గ్రాండ్ గా జరిగితే సమాజంలో అంతగా తమ హోదా పెరుగుతుందని భావిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా నేతలెవరూ దీనికి మినహాయింపు కాదు.
కానీ బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ మాత్రం తాను అందరిలాంటి వాణ్ని కాదని, ప్రజలకు ఇచ్చే సలహాలను తాను కూడాఆచరించి చూపుతానని నిరూపిస్తున్నారు. సుశీల్ కుమార్ తన కుమారుడి వివాహాన్ని చాలా సింపుల్ గా చేయడంతో పాటు…ప్రభుత్వం ఇటీవల చేస్తున్న ప్రచారానికి తగ్గట్టుగా కట్నం తీసుకోకుండా కోడలిని తెచ్చుకుంటున్నారు. ఆయన కుమారుడు ఉత్కర్ష్ బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. కోల్ కతాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ యామినితో ఆయనకు వివాహం కుదిరింది. ఈ పెళ్లి ఎలాంటి హడావుడి, హంగామా లేకుండా చేయాలని సుశీల్ కుమార్ నిర్ణయించుకున్నారు. రెండు గంటల్లో పెళ్లి తంతు కార్యక్రమాన్ని ముగించనున్నారు. వచ్చిన అతిథులకు విందు కూడా లేదు. కేవలం ప్రసాదం మాత్రం పంచిపెట్టనున్నారు.
ఆహ్వాన పత్రికలు కూడా వాట్సప్, మెయిల్ ద్వారా పంపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా నెట్ లోనే ఆహ్వానం పంపారు. అలాగే ఆహ్వాన పత్రికల్లో వరకట్నం తీసుకోవడం లేదని కూడా రాయించారు. అందరికీ భిన్నంగా ఇలా సింపుల్ గా తన కుమారుడి పెళ్లిచేయడంపై సుశీల్ కుమార్ సంతోషం వ్యక్తంచేశారు. కట్నం తీసుకోవడం లేదనే విషయాన్ని చెప్పేందుకు చాలా గర్వపడుతున్నానని, విందు, బరాత్, నృత్యం లేకుండా సింపుల్ గా వివాహం జరిపిస్తున్నానని ఆయన తెలిపారు. సుశీల్ కుమార్ తీరు చూసిన తర్వాతైనా… పెళ్లి కోసం కోట్లాదిరూపాయలను వృథాగా ఖర్చుచేస్తున్నవారికి కనువిప్పు కలుగుతుందేమో చూడాలి.