పాస్‌పోర్ట్ సేవలు మరింత ఈజీ కానున్నాయి. పాస్‌పోర్ట్ సేవా యాప్‌ను విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రారంభించడంతో పాస్‌పోర్ట్ పొందడం మరింత సులభతరం కానుంది. నిన్నమొన్నటి వరకు కొత్త పాస్ పోర్ట్ కోసం ఇంటర్నెట్లో పాస్ పోర్ట్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా నేరుగా స్మార్ట్ ఫోన్ ద్వారా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన పాస్‌పోర్టు సేవా దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ‘ఎంపాస్‌పోర్టు సేవా’ యాప్‌ను ప్రారంభించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చునే దరఖాస్తును నింపుకోవచ్చు. పాస్‌పోర్టు కోసం చెల్లించాల్సిన నిర్ణీత రుసుములను కూడా మొబైల్ ద్వారానే చెల్లించే వీలుంది. అంతేకాక, ఒకసారి ధరఖాస్తు పూర్తి చేసి, పంపిన తర్వాత తమ ధరఖాస్తు ఎప్పుడు ఏ స్టేజిలో ఉందో తెలుసుకునే వీలుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే… ఇప్పటి వరకు ధరఖాస్తుదారు తమ ప్రాంత పరిధిలోనే పాస్‌పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలనే నియమం ఉండేది. ఇప్పుడా నిబంధన లేదు. ఎవరు ఎక్కడి నుంచైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ధరఖాస్తుదారు పేర్కొన్న చిరునామాకే పాస్‌పోర్టును పంపుతారు.
పాస్ పోర్ట్ అప్లై చేయడానికి సంబంధించి ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేస్తే సరిపోతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పాస్‌పోర్ట్ అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవటానికి అవకాశముంటుంది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్ డేట్, వెరిఫికేషన్ కోసం సిద్ధ పరచుకోవలసిన డాక్యుమెంట్లు, దగ్గర్లోని పాస్‌పోర్ట్ కేంద్రాల సమాచారం, పాస్‌పోర్ట్ కి అప్లై చేయడానికి చెల్లించవలసిన ఫీజు తదితర వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో పాస్‌పోర్టు జారీ సందర్భంగా పోలీస్ వెరిఫికేషన్ ఉండేది. పోలీసులు ఇచ్చే నివేదికపైనే పాస్‌పోర్టు జారీ చేసేవారు. అయితే, ఇప్పుడా నిబంధన లేదు. పోలీస్ వెరిఫికేషన్‌ను తొలగించారు. ధరఖాస్తుదారుడికి ప్రభుత్వం వివిధ గుర్తింపు కార్డులు జారీ చేసినప్పుడు మళ్లీ వాటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తేల్చేసింది. ధరఖాస్తుదారుడిపై కేసులు ఉన్నాయా? లేదా? అన్న దానికి మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ పరిమితం కానుంది. సో ఇప్పటికి మీకు పాస్‌పోర్టు లేకపోతే వెంటనే ఈ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, మీకు కావాల్సిన తేదీలో స్లాట్ బుక్ చేసుకోండి.