తెలంగాణలో కొత్త ప్రభుత్వం గద్దెనెక్కి పదిహేను రోజులవుతోంది. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణాస్వీకారం కూడా పూర్తి కాలేదు. అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల ఊహల్లో ఉండి మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆశావాహుల ఎదురుచూపులకు కేసీఆర్ తెరదించనున్నారు. తెలంగాణ భవన్ లో కాబోయే మంత్రులెవరనే చర్చ జోరుగా నడుస్తోందట, ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం మోదీతో భేటీ అవుతారు. రేపు సాయంత్రం ఆయన తిరిగి వస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ 28వ తేదీ విస్తరణ ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. 28నే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ గానే ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ దాటితే సంక్రాంతి పూర్తయ్యే వరకు మంచి ముహూర్తాలు లేనందున ఈ నెలాఖరునే కొత్త మంత్రి వర్గం కొలువుదీరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
వాస్తవానికి అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రుల సంఖ్య 18కి మించకూడదు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మరో మంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేసారు. అంటే ఇక మరో 16 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అన్ని మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. పరిపాలనా సౌలభ్యం కోసం ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి మిగతా వారి పై పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి విడత విస్తరణలో గులాబీ బాస్ కేసీఆర్ విధేయులకు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, జిల్లాల సీనియర్ లకి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయతే మొదటి విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.