బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘కాఫీ విత్ కరణ్’ షోకి హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ వెళ్లి అక్కడ సరదా ప్రశ్నల్లో భాగంగా అమ్మాయిలు, డేటింగ్ గురించి చర్చ వచ్చింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన హార్దిక్ పాండ్య తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానం మీదా అభ్యంతరకరంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావని ప్రశంసించాడని వివాదాస్పద రీతిలో చెప్పుకొచ్చాడు. దీంతో వీరిద్దరి మీద వేటు వేసింది బీసీసీఐ. సస్పెన్షన్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత్ కి వచ్చేసారు ఇద్దరూ. తాజాగా వీరికి హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌కి ఊరట లభించింది.
ఈ ఇద్దరు క్రికెటర్లపై ఉన్న సస్పెన్షన్‌ని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు బీసీసీఐ పాలకుల కమిటీ ఈరోజు ప్రకటించింది. సస్పెన్షన్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన హార్దిక్, రాహుల్ న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లేందుకు తాజాగా మార్గం సుగుమమైంది. హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కేసుని విచారించేందుకు అంబుడ్స్‌మన్‌ని నియమించాలని ఇటీవల బీసీసీఐ పాలకుల కమిటీ సుప్రీంకోర్టుని అభ్యర్థించగా కోర్టు సహాయకుడిగా మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహను మాత్రమే నియమించింది. తాజాగా అతనితో చర్చించే సస్పెన్షన్‌ని ఎత్తివేసినట్లు కమిటీ ప్రకటించింది. టాక్ షోలో తాము చేసిన వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ ఇప్పటికే క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే.