Election Updates: అనుమానాస్పదంగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్

Election Updates: Suspicious container enters AP CM's camp office
Election Updates: Suspicious container enters AP CM's camp office

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. AP 16 Z 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. సాధారణంగా Z సిరీస్ ఆర్టీసీ బస్సులకు, P సిరీస్ అయితే పోలీసు వాహనాలకు ఉంటుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్గేట్ ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్న వారి వివరాలను నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్పోస్టు సిబ్బందికి చెబుతారు. మెయిన్గేటు నుంచి డివైడర్కు ఎడమవైపున ఈ వాహనాలులోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్పోస్టు వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబరు, అందులో వచ్చిన వారి వివరాలను సరిచూసుకుంటారు.

మంగళవారం వచ్చిన కంటెయినర్ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చినా, రెండో చెక్పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా.. కుడివైపు దారిలో మళ్లించి రాంగ్రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెక్పోస్టు వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. ఈ రెండో చెక్పోస్టు ముందు నుంచి (డివైడర్ ఎడమవైపు దారిలో) కాకుండా వెనుకవైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటెయినర్ భాగాన్ని లోపలివైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చినదారిలోనే వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటెయినర్ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల్లా ఎడమవైపు నుంచి కాకుండా వ్యతిరేకమార్గంలో వెళ్లడం, అలా వెళుతున్నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి.