హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరామునిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వాటికి నిరసనగా స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఆయన గృహ నిర్బంధంలోనే ఉన్నారు. మరోవైపు కత్తి మహేశ్‌ను కూడా రెండు రోజుల క్రితం నగర బహిష్కరణ చేసిన పోలీసులు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపూర్ణానందను ఇప్పటివరకూ గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు, బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లో ఉన్న పరిపూర్ణానంద నివాసం నుంచి ఆయన్ని తరలించారు. అయితే పోలీసులు తెలివిగా ఇప్పటి కేసును పేర్కొనకుండా గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈరోజు తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు. ఆయనను తరలించడంలో పోలీసులు చాకచక్యం ప్రదర్శించారు. స్వామి తరలింపు కోసం వారు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసారని తెలుస్తోంది. కొన్ని వాహనాలను విజయవాడ వైపు, మరికొన్ని వాహనాలను శ్రీ శైలం వైపు పంపగా ఎటువైపు తీసుకెళ్లారో తెలియకుండా చేశారు పోలీసులు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారిక ప్రకటన ప్రకారం కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించినట్లు పోలీసులు తెలిపారు.