“ఆపరేషన్ గరుడ” లో దేవుడిని కూడా వాడేస్తారా?

Swamiji use Gods for Operation Garuda

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ఆపరేషన్ గరుడ“ అని ప్రత్యేక హోదా సాధన సమితి నేత, నటుడు శివాజీ చెప్పినప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ ఆశ్చర్యపోయింది. అయితే అది నిజం అనే విధంగా రాజకీయ వాతావరణం కూడా కనిపించడంతో ఇందులో కొంత వాస్తవికత ఉందన్న ఆలోచన మొదలైంది. ఇక లోక్ సభలో అవిశ్వాస నోటీసులు, ఇక్కడ వివిధ పార్టీల తీరుతెన్నులు చూసాక ఆపరేషన్ గరుడ పూర్తిగా నిజమే అన్న ధోరణి బలపడింది. ఈ విషయం బట్టబయలు అయ్యాక కూడా వైసీపీ తీరులో పెద్ద మార్పు లేదు. ఆ పార్టీ జనం గమనిస్తున్న విషయం కూడా లెక్క చేయకుండా బీజేపీ ముందు సాగిలపడటమే కాదు… ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కాస్త చంద్రబాబు వ్యతిరేక ఉద్యమం గా మలుస్తోంది.

ఇక “ఆపరేషన్ గరుడ“ ఆరోపణలు వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త అయోమయంలో పడ్డారు. వామపక్షాలతో కలిసి ఆయన హోదా ఉద్యమం నడిపిస్తున్నా ఎక్కడా మోడీ మీద పల్లెత్తు మాట అనడం లేదు. అదే సమయంలో తన మీద ఎదురు దాడి మొదలెట్టిన టీడీపీ విషయంలో కూడా ఆయన కొద్దిగా తగ్గి వుంటున్నారు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే “ఆపరేషన్ గరుడ “ రహస్యం బట్టబయలు కావడంతో పాత్రలు, పాత్ర దారులు మారిపోతారా అన్న సందేహాలు వస్తున్నాయి.

Hero Sivaji on Operation Garuda

ఆ అనుమానాలు వస్తున్న తరుణంలోనే ఆపరేషన్ గరుడ గుట్టు రట్టు చేసిన హోదా సాధన సమితి నేత శివాజీ మరోసారి గొంతు విప్పారు. తమ సమితి తరపున 2014 ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన హామీలతో కూడిన వీడియో సీడీలని ప్రధానికి పంపనున్నట్టు చెప్పున శివాజీ మే మొదటి వారంలో ఆపరేషన్ గరుడకి సంబంధించిన ఇంకొన్ని రహస్యాలు బయటపెడతామని చెప్పారు. ఇక కొందరు స్వామీజీలు కూడా హోదా ఉద్యమాన్ని దెబ్బ కొట్టేందుకు వేర్వేరు కారణాలతో రంగంలోకి దిగుతారని శివాజీ సందేహపడ్డారు. అందుకు తగ్గట్టే టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు స్వామీజీలు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు ఇస్తున్నారు. మున్ముందు ఇదే విషయం మీద ఉద్యమం కొనసాగించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరి వాదనకు బీజేపీ సహా ఆ పార్టీకి అండగా నిలిచే కొన్ని సంస్థలు మద్దతు ఇస్తున్నాయి.

కర్ణాటక ఎన్నికల తర్వాత ఉవ్వెత్తున లెగిచే హోదా ఉద్యమం తాలూకా ప్రకంపనలు ఇప్పటికే ప్రజా వ్యతిరేకతతో అల్లల్లాడుతున్న ప్రధాని మోడీ మీద పడకుండా చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా దేవుడిని కూడా అడ్డం పెట్టుకోడానికి ఆపరేషన్ గరుడ వ్యూహకర్తలు వెనుకాడటం లేదు. ఈ వ్యవహారంలో శివాజీ హెచ్చరికల్ని పట్టించుకోకుండా జనం కుల, మత ప్రభావాలకు లోను అయితే మున్ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమకు తెలియకుండా తాము కూడా ఆపరేషన్ గరుడలో పావులు అయ్యే ప్రమాదం పొంచి వుంది. తస్మాత్ జాగ్రత్త .