Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేంద్ర సింగ్ ధోనీ టీ20ల నుంచి తప్పుకుని కుర్రాళ్లకు అవకాశమివ్వాలన్న సలహాలు ఎంతగా వినిపిస్తున్నాయో… ఆయనకు మద్దతుగా నిలిచేవారి సంఖ్యా అలాగే పెరుగుతోంది. ఇప్పటికే సునీల్ గవాస్కర్, సెహ్వాగ్, కోహ్లీ ధోనీకి మద్దతు తెలపగా… తాజాగా మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి కూడా వాళ్లతీరులోనే వ్యాఖ్యానించాడు. ధోనీపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయో తనకు అర్ధం కావడం లేదని, ధోనీ టెస్టు, వన్డే, టీ20 అన్న తేడాలేకుండా అన్ని ఫార్మాట్లలోనూ దేశానికి ఎన్నో అపూర్వ విజయాలు అందించాడని, భారత క్రికెట్ కు అతను నిజమైన సేవకుడు అని కిర్మాణి కొనియాడారు.
జట్టులో తప్పనిసరిగా అనుభవం ఉన్న ఆటగాడు ఉండాలని, అది యువ ఆటగాళ్లకు కలిసొచ్చే అంశమని, ధోనీ సహచర ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తాడని కిర్మాణి అభిప్రాయపడ్డారు. ధోనీ ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటాడని, రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతనికే వదిలేయాలని కిర్మాణి సూచించాడు. ఒకప్పుడు దేశం తరపున ఆడి రిటైరైన వారు ధోనీ గురించి ఇలా మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ధోనీ లాంటి అనుభవజ్ఞుడిని జట్టులో వద్దని ఎందుకు అంటున్నారో తనకు కారణమే తెలియడం లేదని కిర్మాణి చెప్పుకొచ్చాడు. అజిత్ అగార్కర్ కూడా మహేంద్రుణ్ని తప్పుకోవాలని కోరుతున్నాడని, ధోనీ గురించి అలా మాట్లాడేందుకు అగార్కర్ ఎంత అని… ఓ జాతీయ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిర్మాణి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ధోనీ వయసు 35కు చేరుకోవడంతో పాటు టీ 20ల్లో మునుపటి వేగం ప్రదర్శించలేకపోవడంతో మహేంద్రుడిపై విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ కోహ్లీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. వయసును చూసే ధోనీపై విమర్శలు చేస్తున్నారని కోహ్లీ మండిపడ్డాడు. మొత్తానికి రోజురోజుకూ ధోనీకి పెరుగుతున్న మద్దతు చూస్తుంటే… అతను మరికొన్నాళ్లు టీ20లు ఆడే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే ఎవరిచేతా వేలెత్తిచూపించుకోవడం ఇష్టపడని ధోనీ… అంతా బాగున్నప్పుడే పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.