యూఏఈ, ఒమాన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్ డ్రాను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ బెర్త్ ఖారారు చేసుకున్నాయి. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా అర్హత సాధించగా, గ్రూప్-2లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాక్‌లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు బరిలో నిలిచాయి.
ఇక క్వాలిఫయర్స్‌కు సంబంధించిన గ్రూప్-ఏలో శ్రీలంక, నమీబియా, నెదర్ల్యాండ్స్, ఐర్లాండ్ జట్లుండగా, గ్రూప్-బీలో ఒమాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా జట్లు పోటీ పడనున్నాయి. క్వాలిఫయర్స్ రెండు గ్రూప్‌ల్లోని తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. ఇదిలా ఉంటే, ఈ మెగా టోర్నీకి సంబంధించిన తుది షెడ్యూల్‌ను ఐసీసీ మరికొన్ని వారాల్లో ప్రకటించనుంది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఎక్కువ శాతం ఒమాన్ వేదికగా జరగునుండగా, సూపర్-12 మ్యాచ్‌లకు దుబాయ్, అబుదాబీ, షార్జాలు వేదికలు కానున్నాయి.