Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్వచ్ఛమయిన ప్రేమకు గుర్తయిన తాజ్ మహల్ ను సందర్శించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి కలుగుతుంటుంది. ఈ పాలరాతి కట్టడం అద్భుత సౌందర్యాన్ని పగలు కన్నా రాత్రి పూట ఎక్కువగా అనుభూతి చెందవచ్చు. అదీ వెన్నెల రోజుల్లో తాజ్ మహల్ అందాన్ని తిలకిస్తే కలిగే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే దేశ, విదేశీ పర్యాటకులు పున్నమి చంద్రుని చల్లని వెన్నెల వెలుగుల్లో తాజ్ మహల్ ను సందర్శించడానికి ఆసక్తిచూపిస్తుంటారు. అయితే అన్ని పౌర్ణమిల్లోకి శరదృతువులో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఆశ్వయుజమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి మరింత దగ్గరగా వస్తాడు.
నిండుగా వెండి వెలుగులను విరజిమ్ముతాడు. అలాంటి నిండు వెన్నెల తాజ్ మహల్ కు కొత్త అందాలు అద్దుతుంది. ఆ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు. అందుకే ఏటా శరద్ పూర్ణిమ రోజున తాజ్ మహల్ ను చూడటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఆగ్రాకు పర్యాటకులు క్యూ కట్టారు. పూర్ణ చంద్రుని కిరణాలు తాజ్ మహల్ పాలరాళ్లపై పడే అద్భుతాన్ని చూడటానికి వారంతా ఉవ్విళ్లూరుతున్నారు. రాత్రి 8.30 నుంచి 12.30 గంటల వరకు ఈ దృశ్యం కనువిందుచేయనుంది.