తమన్నాని తీసుకోపోవడానికి అదే కారణం : ఓంకార్

తమన్నాని తీసుకోపోవడానికి అదే కారణం : ఓంకార్
రాజు గారి గది-3’ సినిమాలోో తమన్నా అనగానే.. ఆ సినిమాకు మంచి ఆకర్షణే తోడైందనుకున్నారంతా. నాగార్జున, సమంత నటించిన ‘రాజు గారి గది-2’ ఫ్లాప్ అయినప్పటికీ.. తమన్నా ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యంగానే అనిపించింది. కానీ ప్రారంభోత్సవంలో పాల్గొని కూడా తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుని పెద్ద షాకిచ్చింది తమన్నా. అయితే దర్శక నిర్మాత ఓంకార్.. ఎక్కువ టైం తీసుకోకుండా అవికా గోర్‌ను ఆమె స్థానంలోకి తీసుకుని చకచకా సినిమా పూర్తి చేసేశాడు. శుక్రవారమే ఈ సినిమా రిలీజవుతోంది. ఐతే కొన్ని రోజుల కిందట మీడియాను కలిసి ఈ చిత్ర హీరో, ఓంకార్ తమ్ముడు అశ్విన్.. తమన్నా తమ సినిమా నుంచి తప్పుకోవడానికి డేట్ల సమస్యే కారణం అన్నాడు. అంతటితో వ్యవహారం సద్దుమణిగినట్లయింది.
కానీ ఇప్పుడు దర్శకుడు ఓంకార్ మాత్రం భిన్నమైన వెర్షన్‌తో మీడియా ముందుకొచ్చాడు. బహుశా ఇదే సరైన వెర్షన్ అని కూడా చెప్పొచ్చు. ‘రాజు గారి గది-3’ కథతో పాటు తన పాత్రను కూడా మార్చాలని తమన్నా డిమాండ్ చేయడంతోనే ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అతను వెల్లడించడం విశేషం. ‘‘సినిమాలో ముందుగా తమన్నాను తీసుకున్న మాట వాస్తవం. ముందుగా ఆమెకు సినిమా లైన్ మాత్రమే చెప్పాం. ఆమెకు నచ్చింది. అయితే సినిమా ప్రారంభమవడానికి కొద్దిరోజుల ముందు ఫుల్ నెరేషన్ ఇచ్చాం. దానికి ఆమె చాలా మార్పులు చెప్పారు.
తన పాత్రను మార్చమని, దానికి సరిపడే విధంగా కథ కూడా మార్చమని అడిగారు. అయితే సినిమా మొదలు పెట్టడానికి కొద్ది రోజులే సమయం ఉండడంతో కథలో మార్పులు చేయడానికి మాకు వీలు లేకపోయింది. దీంతో తమన్నా వద్దనుకున్నాం. తాప్సి, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ల కోసం ప్రయత్నించాం. కానీ వాళ్ల డేట్లు ఖాళీ లేకపోవడంతో అవికాను తీసుకున్నాం. ఆ అమ్మాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది’’ అని ఓంకార్ తెలిపాడు