జగన్ ని అయోమయంలోకి నెట్టేస్తున్న తమిళ్ పాలిటిక్స్.

dinakaran win rk nagar Bypoll elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ వారం రోజుల వ్యవధిలో తమిళనాట రాజకీయ పరిణామాలు వైసీపీ అధినేత జగన్ ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఎక్కడో చంద్రబాబుని తిట్టుకుంటూ పాదయాత్ర చేసుకుంటున్న జగన్ కి తమిళనాడు రాజకీయాలతో సంబంధం ఏముందిలే అనుకుంటున్నారా ? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. 2019 ఎన్నికల కోసం , అక్రమార్జన కేసుల్లో విముక్తి కోసం జగన్ బీజేపీ ప్రాభవం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోడీ తలచుకుంటే తాను కేసుల నుంచి బయటపడడమే కాదు. ఆంధ్రప్రదేశ్ సీఎం కుర్చీలో దర్జాగా కూర్చోవచ్చని నమ్మారు. అందుకే టీడీపీ ,బీజేపీ మధ్య విభేదాలు వచ్చేలా కమలనాథుల్లో కొందర్ని రెచ్చగొట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే చాలు తన కలలన్నీ నెరవేరతాయని జగన్ భావించి వుంటారు. దీనికి , తమిళ రాజకేయాలకు సంబంధం ఏమిటంటే అక్కడ డీఎంకే కూడా అదే ఆలోచన చేసింది. 2 జి స్కాం నుంచి కనిమొళి,రాజా ని రక్షించడంతో పాటు బీజేపీ అండతో తమిళ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చని స్టాలిన్ నమ్మారు. స్టాలిన్ నమ్మకానికి తగినట్టు 2 జి స్కాం నుంచి కనిమొళి, రాజా ఎప్పుడైతే బయటపడ్డారో అప్పుడు డీఎంకే కన్నా వైసీపీ నేతలు ఎక్కువగా ఆనందపడివుంటారు. బీజేపీ ని నమ్ముకుంటే భద్రంగా ఎన్నికల, కేసుల గండం నుంచి బయటపడొచ్చు అన్న తమ నమ్మకం నిజం అవుతుందని అనుకున్నారు.

2 జి కేసు తీర్పు ఆనందాన్ని ఆస్వాదించేలోపే ఆర్కే ఎన్నికలు వచ్చిపడ్డాయి. అక్కడ దినకరన్ గెలుస్తారని ఎవరూ అనుకోలేదు.ఒక్క సుబ్రమణ్యస్వామి తప్ప. జగన్ కూడా బీజేపీ తో స్నేహానికి రెడీ అయిపోయిన డీఎంకే గెలుస్తుంది అనుకున్నారు. గెలవాలని కోరుకుని వుంటారు. కానీ జరిగింది వేరు. బీజేపీ తో డీఎంకే అంటకాగుతోందని తెలిసిన వెంటనే ఆ పార్టీని విసిరికొట్టారు. జయ సీఎం గా వున్నప్పుడు కంటే ఆర్కే నగర్ లో తక్కువ ఓట్లు ఇప్పుడు డీఎంకే కి వచ్చాయి. అవినీతి ఆరోపణలున్న దినకరన్ గెలిచాడని సంబరపడాలా లేక బీజేపీ తో పొత్తు పెట్టుకుని డీఎంకే దెబ్బ తిన్న వైనాన్ని చూసి జాగ్రత్తపడాలా? అలా అని బీజేపీ ని కాదనుకుంటే అసలు కేసుల నుంచి బయటపడే దారి లేదు. ఇప్పుడు ఏమి చేయాలి ? ఈ సందిగ్ధం ఇప్పుడు జగన్ ని వెన్నాడుతోంది. పొత్తులు, ఎత్తులు ఎన్ని వేసినా చివరకు ఓటు వేయాల్సింది జనం అని మర్చిపోయి ఊహలకు రెక్కలు అల్లుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.