ఆంధ్రప్రదేశ్ లో అధికార పీఠాన్ని అందుకోడానికి 2009 ఎన్నికల ముందు మెగా స్టార్ చిరంజీవి ఎన్నో ఆశలతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఓ ఫెయిల్యూర్ గా నిలిచిందన్నది చేదు వాస్తవం. ఆ ఎన్నికల్లో ఓటమి ఒక ఎత్తు అయితే దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం అంతకు మించిన విమర్శలకి తావిచ్చింది. చిరంజీవి సినీ ప్రయాణంలో ఎక్కని శిఖరాలు లేవు. చేరుకోలేని మజిలీలు లేవు. అయితే అదంతా పాలిటిక్స్ కి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది. ఇప్పటికీ చిరు ప్రజారాజ్యం తాలూకా చెడ్డ పేరు మోయక తప్పని పరిస్థితి. సినిమాల షూటింగ్ లో పడి కాంగ్రెస్ కి దూరంగా వుంటున్నా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజారాజ్యం టాపిక్ వస్తూనే వుంది. ఒకప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసి ఇప్పుడు వివిధ పార్టీల్లో వున్న నాయకులు ఒకప్పుడు ఆ పార్టీ వైఫల్యానికి ఎన్నో కారణాలు చెబుతున్నారు. ఈ విషయంలో మెగా స్టార్ తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ సైతం అవకాశం వచ్చినప్పుడు ప్రజారాజ్యం ఫెయిల్యూర్ మీద తమ స్థాయిలో విశ్లేషణ చేసిన వారే.
ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూసినప్పుడల్లా ఎంత ఆపుకుందాం అనుకున్నా మెగా స్టార్ కి ప్రజారాజ్యం బాధ తప్పడం లేదు. చిరంజీవి ఇప్పుడిప్పుడే ప్రజారాజ్యం గాయం మానుతుంది అనుకుంటున్న ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు ఆ పుండుని కెలుకుతూనే వున్నారు. ఇప్పుడు తమిళుల వంతు వచ్చింది. ఎప్పుడైతే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటన చేశారో అప్పటినుంచి ప్రజారాజ్యం వైఫల్యం మీద తమిళ పత్రికల్లో విరివిగా కధనాలు వస్తున్నాయి. మెగా స్టార్ కి సినీ రంగంలో ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ పాలిటిక్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాడో వివరిస్తూ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాస్తున్నాయి. చెన్నై లో చాన్నాళ్లు వుండొచ్చిన మెగా స్టార్ కి ఈ విషయాలు అక్కడి ఫ్రెండ్స్ ద్వారా చెవినబడుతూనే వున్నాయి. ఇక తాజాగా డీఎంకే అధికార పత్రిక మురసోలి కూడా ప్రజారాజ్యం వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ భారీ కథనమే ఇచ్చింది. టార్గెట్ రజని అయినప్పటికీ తమిళ పత్రికల వ్యవహారం మెగా స్టార్ పుండు మీద కారం చల్లినట్టు వుంది.