Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గజల్ వీడియోలను, యాంకర్ ప్రదీప్ కేసును మీడియా ఎందుకు పదే పదే చూపిస్తోంది…? దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు వచ్చిన సందేహం ఇది. ఆయనకే కాదు… తెలుగు రాష్ట్రాల టీవీ ప్రేక్షకులందరికీ టీవీ చానళ్లపై ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి. ఓ ప్రాంతీయ భాషలో లెక్కకు మించి చానళ్లు పుట్టుకొస్తే వార్తా ప్రసారాల విషయంలో వాటి పరిస్థితి ఎంతలా దిగజారుతుంది అన్నది తెలుగు న్యూస్ చానళ్లు చూస్తే అర్ధమవుతుంది. చూపించకూడనిది, అవసరం లేనిది, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేనిది న్యూస్ చానళ్లు పదే పదే చూపించడానికి కారణం టీఆర్పీ రేటింగ్స్… వాటి ఆధారంగా వచ్చే అడ్వర్టయిజ్ మెంట్స్ కోసం. వాణిజ్య ప్రకటనల ఆదాయం తెచ్చుకుని చానళ్ల ద్వారా లాభాలు సంపాదించాలనుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ అందుకోసం ఎంచుకున్న మార్గాలే వాటి విలువను, విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఓ వార్తను వార్తారూపంలో చూపడం కాకుండా… దానికి అమిత ప్రాధాన్యం ఇచ్చి 24 గంటల న్యూస్ చానళ్లు రోజుమొత్తం చూపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో నిజమైన వార్తలకు బులెటిన్స్ లో చోటు కూడా దక్కదు. గజల్ శ్రీనివాస్, ప్రదీప్ వార్తలే చూసుకుంటే… రోజు మొత్తం వారి గురించి చూపే క్రమంలో జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన వార్తలు కూడా ప్రసారం చేయలేదు. ఇప్పుడే కాదు… 24 గంటల న్యూస్ చానళ్లు ప్రారంభమైన తొలిరోజు నుంచీ ఇదే పరిస్థితి. రేటింగ్స్ సంపాదించేందుకు దేనికైనా దిగజారడానికి సిద్ధపడ్డాయి. నైతికవిలువలు, మీడియా పరిధి వంటి అంశాలకు న్యూస్ చానళ్లు అతీతమనే చెప్పవచ్చు. తమ్మారెడ్డి అన్నట్టు ఇలాంటి వార్తల వల్ల అవి సమాజానికి మేలు చేయకపోగా… కీడే ఎక్కువగా చేస్తున్నాయి. పదే పదే ఆ వార్తలను చూపించడం వల్ల సంబంధం లేనివాళ్లపై కూడా అది ప్రభావం చూపిస్తోంది.
ఇటీవలి వ్యవహారాలు చూస్తే… బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్మ, స్వాతిరెడ్డి భర్తను చంపిన ఉదంతం వంటివాటిని రోజుల తరబడి ప్రసారం చేశాయి టీవీ చానళ్లు. ఇలాంటి ఘటనలు సాధారణ ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావం చూపిస్తాయనడానికి స్వాతిరెడ్డి ఉదంతం తర్వాత అలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగుచూడడమే నిదర్శనం. తమ్మారెడ్డి చెప్పింది కూడా అదే. ఇలాంటి వాటివల్ల తెలియని వాళ్లు తెలుసుకునే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. చానళ్ల వైఖరి ఇలాగే కొనసాగితే… ముందు ముందు మరింతమంది న్యూస్ చానళ్లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశమూ ఉంది. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడడమూ, రేటింగ్స్ కోసం చెడు ప్రభావాన్ని కలిగించే వార్తలను ప్రసారం చేయడమూ, నేరపూరిత వార్తలను ప్రత్యేక ఎపిసోడ్లుగా తీర్చిదిద్దడమూ ఆపివేసి ప్రజాపయోగం కలిగించే వార్తలను వేయడం ద్వారా రేటింగ్స్ తెచ్చుకునేందుకు చానళ్లు ప్రయత్నించాలి.