వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పెళ్లిళ్ల కామెంట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతున్నాయి. తొలుత పవన్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని వ్యాఖ్యానించిన ఆయన తర్వాత చంద్రబాబు ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని వ్యాఖ్యానించాడు. అయితే చంద్రబాబు మీద చేసిన వ్యాఖలకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ కు ఈ మధ్య పెళ్లిళ్ల యావ ఎక్కువైందన్న సోమిరెడ్డి అతని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో తెలుసుకోవాలన్నారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నారన్నారు.
అంతేకాక జగన్ తన స్వార్థం కోసం చేసుకున్న ఎన్ని పెళ్ళిళ్లు చేసుకున్నాడో లెక్కే లేదని కేసుల నుంచి బయట పడేందుకు కాపురం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనసేనతో వైసీపీ పెళ్లి ఖాయమని మాజీ ఎంపీ వరప్రసాద్ చెప్తున్నారని ఇక మోడీతో కేసులకు భయపడి జగన్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. చట్ట సభల్లో కూడా ప్రధాని మోదీని వ్యతిరేకించిన దమ్ము టీడీపీకి ఉందని.. జగన్‌లా కేసులకు భయపడేది లేదన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ అవసరముందని.. జాతీయ రాజకీయాలకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఆయన తాముఎవరితో పొత్తు పెట్టుకున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.