Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు సర్కార్ మీద చేసిన ఆరోపణలకు కొనసాగింపుగా ఓ 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమకు ఈ విషయాలన్నీ చెప్పారని పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలిసిందే. ఆ మాట నిజం అని జనసేన కి కొత్తగా అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన అద్దేపల్లి శ్రీధర్ కూడా ముక్తాయించారు. విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కి వున్న ఎమ్మెల్యేలు మొత్తం 175 మంది. అందులో టీడీపీ తరపున గెలిచింది 102 మంది. ఇక 20 మందికి పైగా వైసీపీ నుంచి వచ్చి కలిశారు. దీంతో టీడీపీ బలం 125 దాకా చేరింది. అందులో 40 మంది అంటే దాదాపు మూడో వంతు మంది పవన్ కళ్యాణ్ తో టచ్ లోకి వెళ్లారంటే అదేమీ చిన్న విషయం కాదు. రాజకీయంగా పెద్ద అంశం. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత జగన్ కలిసి చంద్రబాబు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న సమయంలో పవన్ చెప్తున్న అంకెలు నిజం అయితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా?. వాళ్ళ మాట పక్కనబెట్టి పవన్ కి తాను చెప్పిన మాటల మీద నమ్మకం ఉంటే అందులో కనీసం 4 పేర్లు ప్రస్తావించరా?. ఈ రెండు విషయాలు కాదు అనుకున్నా కనీసం సంచలనాల కోసం ఎదురు చూసే మీడియా అయినా ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా ? కనీసం ఒక్క చర్చ అయినా ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరు అని పెట్టదా?
పైన లేవనెత్తిన ప్రశ్నల్లో ఒక్క దానికి అయినా సమాధానం ఉంటే పవన్ చెప్పిన ఆ 40 మంది కథ నమ్మొచ్చు. కానీ అదేమీ లేదని అందరికీ తెలుసు. అందుకే ఆ ప్రకటన గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఇక 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు టీడీపీ ని బెదిరించడానికి ఇలాగే ప్రెస్ మీట్స్ పెటేవాళ్ళు. అప్పట్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదన్న భయంతో చాలా మంది సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిన మాట నిజం. అక్కడ చేదు అనుభవాలు చూసి తిరిగి వచ్చిన మాట అంత కన్నా నిజమ్. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జనసేన వైపు మొగ్గడానికి కాదు కనీసం ఆలోచించడానికి కూడా దేశం ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. ఈ సత్యం తెలిసి కూడా పదేపదే అదే పాత కథ చెబితే ఇప్పటికే దెబ్బ తిన్న జనసేన విశ్వసనీయత ఇంకా దెబ్బ తింటుంది.