హస్తం – సైకిల్ పొత్తు…డ్రైవింగ్ సీట్…!

TDP Alliance With Congress In The Upcoming Elections In Telangana
తెలంగాణాలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు తెలుగుదేశంలో సెగలు రేపుతున్నాయి. ఒకవైపు అధినేత చంద్రబాబు ఈ విషయమై ఆచితూచి అడుగులేస్తున్నారు. నేరుగా పొత్తు పెట్టుకుంటే అది ఏపీలో టీడీపీ దెబ్బ తింటుందనే ఆందోళ‌న చంద్ర‌బాబులో క‌నిపిస్తోంది. ఏపీ ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్యంగా కాబ‌ట్టి నిర్ణ‌యం త‌నకు త‌గ్గ‌ట్టుగా ఉండేలా చూసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కేయీ, చినరాజప్ప వంటి వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరైతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తాము రాజీనామాలు సిద్ధమని బహిరంగ ప్రకటన చేస్తున్నారు. దీంతో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టిడిపిలో కాంగ్రెస్ పొత్తు అంశం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మాభిమానం పేరుతో ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం. కాంగ్రెస్ నాయకులు కుక్కమూతి పిందెలంటూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి అప్పట్లో అధికారపీఠం కైవసం చేసుకున్నారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి దాకా పార్టీ నాయకత్వంలో మార్పు వచ్చినా కాంగ్రెస్ పార్టీతో వైరం మాత్రం టిడిపికి అలాగే కొనసాగిస్తూ వచ్చింది. అయితే మారిన రాజకీయాల నేపథ్యంలో శత్రుత్వం మిత్రత్వంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని టిడిపికి ప్రధాన శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు చంద్రబాబు. తెలంగాణాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రమె కావడంతో ఆయన కొత్త మిత్రుల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆయన ముందున్న ఒకే ఒక పార్టీ కాంగ్రెస్.
cm-alience
ఈ నేపథ్యంలో ఒక్క దెబ్బతో రెండు పిట్టలన్న చందంగాను కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల అటు తెలంగాణాలో ఐదారు స్థానాలు గెలిచి అసెంబ్లీలో తామున్నామని నిరూపించుకోవాల్సిన స్థితిలో ప్రస్తుతం తెలంగాణా టిడిపి ఉంది. అయితే రెండు రాష్ట్రాల ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త పడుతోంది. ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నామన్న సంకేతాలు ఇప్పటినుంచే మొదలుపెట్టేసింది. ఏది ఏమైనా చంద్రబాబు కాంగ్రెస్‌కు ఇస్తున్న స్నేహ హస్తం తెలంగాణాలో వర్కవుటై ఆ పార్టీకి నాలుగో, ఐదో స్థానాలు వచ్చినా ఏపిలో మాత్రం ప్రకంపనలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి ప్రారంభం నుంచే కొంతమంది సీనియర్ నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా కె.ఈ.క్రిష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడుతో పాటు నారాయణ లాంటి నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని బహిరంగం గానే వ్యతిరేకించారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరగడం అలా ఉంచితే ఈ నిర్ణయం బెడిసికొడుతుందన్న భయాన్ని అంతర్గతంగా వ్యక్తమవుతోంది. అలాగే దశాబ్ధాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ – టిడిపిలో పైస్థాయిలో ఉన్న నేతలు కలిసినా దిగువస్థాయి కార్యకర్తలు కలిసి పనిచేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తెలంగాణాలో ఎన్నిక‌ల పొత్తు విష‌యంలో టీటీడీపీదే నిర్ణ‌యం అన్న‌ట్టుగా బాబు ప్రకటించారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ప్ర‌చారానికి ఆయ‌న రావ‌డం లేద‌ని తేల్చేశారు. కాంగ్రెస్ తో పొత్తు కాకుండా కేవ‌లం స‌ర్థుబాటుతో మాత్ర‌మేన‌ని చెప్పుకోవ‌డానికి ఆయ‌న పావులు క‌దుపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీలో ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న చంద్ర‌బాబు ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న‌ట్టు భావిస్తున్నారు. తెలంగాణాలో క‌లిసి సాగితే క‌లిగే ప్ర‌యోజ‌నం క‌న్నా ఏపీలో కాంగ్రెస్ తో క‌ల‌వ‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టం ఎక్కువేన‌ని చంద్ర‌బాబు నిర్థారించుకున్న‌ట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా స్థానిక నేత‌ల‌కే బాధ్య‌త అప్ప‌గించిన‌ప్ప‌టికీ బాబు ప్ర‌చారానికి దూరంగా ఉంటాన‌ని చెప్ప‌దాన్ని తెలంగాణా నేతలు జీర్ణించుకో లేకపొతున్నారు. మొత్తం మీద చంద్రబాబు డ్రైవింగ్ సీటు టీటీడీపీకి అప్పచెప్పి ఆయన తప్పుకున్నట్టే. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఏమేరకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనేది వేచి చూడక తప్పదు.
cm-alience