ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం నేపధ్యంలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు, మిగతా టీడీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు పరమానందయ్య శిష్యుల తరహాలో నారా నందయ్య శిష్యుల్లాగా తయారయ్యారని విమర్శించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నేపధ్యంలో వివరణ ఇచ్చిన ఆయన టీడీపీ ఎమ్మెల్యేలను అవమానించాలని తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని కానీ చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో తనిఖీలు చేయగానే టీడీపీ నేతలంతా మా లీడర్ కు అన్యాయం జరిగిపోయిందని, మా లీడర్ ను అవమానించారని చెప్పుకున్నారనీ, అసలు చంద్రబాబుకు అన్యాయం జరగలేదు, అవమానం జరగలేదు. టీడీపీ నేతలు పరమానందయ్య శిష్యులలాగా ప్రతీ చోట ఇలా చెప్పుకోవడం వల్లే ఆయనకు అవమానం జరిగిందని చెప్పుకొచ్చారు. అలాగే జాతీయ స్థాయిలో చక్రాలు గిరగిరా తిప్పిన వ్యక్తులకు సైతం సాధ్యం కాని అద్భుతమైన మెజారిటీని రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పగించారని, 151 సీట్లు ఇచ్చి చాలా పెద్ద బాధ్యతను మోపారని, అలా అని విజయ గర్వం తకేక్కితే అయిపోతామని ఆయన చెప్పుకొచ్చారు. బాబు ఐదేళ్ల క్రితం బెల్టు షాపులు రద్దుచేస్తున్నట్లు తొలి సంతకం పెట్టారనీ, కానీ అది అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఆ హామీని అమలు చేస్తున్నారని అన్నారు. ‘మీరు ఇచ్చిన హామీని మా నాయకుడు అమలు చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చిదంటే వీళ్లు తలకాయను ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.