విశాఖపట్టణం జిల్లాలోని అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను నిన్న మావోయిస్టులు కాల్పి చంపారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామకార్యదర్శిని కార్యక్రమంలో వారు పాల్గొన్నవారు తిరిగి వస్తుండగా డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. వీరు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారని, మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో వీళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.
ఈ దాడిలో 60 మంది సాయుధులైన మావోయిస్టులు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వీరిలో పాతికేళ్లలోపు వారే అధికం కాగా, సగం మంది మహిళలే. రహదారిపై చుట్టుముట్టి నేతలిద్దరినీ తీసుకెళ్లడం, కాల్చి చంపడంలో మహిళా మావోయిస్టులే కీలకంగా వ్యవహరించారు. ఈ బృందానికి ఓ మహిళ నాయకత్వం వహించడం విశేషం. దాడికి పాల్పడింది నందాపూర్ ఏరియా కమిటీగా పోలీసుల నిర్దారించారు. నందాపూర్ దళానికి చైతన్య అలియాస్ అరుణ నాయకత్వం వహించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మావోయిస్ట్ చలపతి భార్యగా అనుమానిస్తున్న అరుణ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా, నారాయణపట్నం ఏరియా కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.
డివిజనల్ కమిటీ మెంబర్ రింకి అలియాస్ స్వరూప, రైనో అలియాస్ సునీల్ ఆధ్వర్యంలో మహిళా మావోయిస్టులు దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. దళ నేతగా భావిస్తున్న ఆ మహిళ నోటి వెంట ‘మీ ఖేల్ ఖతం’ అనే మాట రాగానే మావోయిస్టులు కిడారి, సోమలను కాల్చి చంపారు. రక్తపు మడుగులో ఉన్న వారిపై కసిగా మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే, మావోయిస్టులు ‘బెయిటెడ్ అంబుష్’ వ్యూహాన్ని అనుసరించి ప్రజాప్రతినిధులను మట్టుబెట్టారు. బెయిటెడ్ అంబుష్ అంటే ఎరవేసి అదునుచూసి పంజా విసరడం. ఆ ఎర ఏ రూపంలోనైనా ఉండవచ్చు.
గిరిజనుల సమస్యల గురించి అభ్యర్థనలు పంపించి, అక్కడకు వచ్చిన వారిని హతమార్చడం. అలాగే చిన్న అలజడికి సృష్టించి, దానిపై ఆరా తీసేందుకు వచ్చిన బలగాలను ఉచ్చులోకి లాగి పెను విధ్వంసానికి పాల్పడటం. రాజీకి వస్తామంటూ తాము టార్గెట్ చేసిన వ్యక్తులను చర్చల పేరుతో తమ వద్దకు రప్పించి హతమార్చడం లాంటివి ఇందులో వ్యూహాలు.
ఈ వ్యూహరచనలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ది అందివేసిన చేయి. గత ఏడాది మే 12న చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో బెయిటెడ్ అంబుష్ ద్వారా సీఆర్పీఎఫ్ దళాలను ఉచ్చులోకి లాగి 25 మందిని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు. విశాఖ మన్యంలో కూడా అధికార పార్టీకి చెందిన నేతలను ‘మాట్లాడుకుందాం రండి’ అని చర్చలకు పిలిపించే మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. సాయుధాలైన మావోయిస్టులు వస్తారని అంచనా వేయని నేతలిద్దరూ అక్కడకు వెళ్లి, వారి ఉచ్చులో చిక్కుకున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.