Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ నాయకుడు అయినా రాజకీయాల్లో ప్రత్యర్థి లేకుండా ఏకపక్షంగా ముందుకు వెళితే బాగుండు అనుకుంటాడు. అనంత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నాడు. ఇప్పటిదాకా తన రాజకీయ ప్రత్యర్థిగా వున్న గుర్నాధరెడ్డి టీడీపీ లో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఇక ఎవరితో పోరాడాలి నేను అంటూ అసెంబ్లీ దగ్గర మీడియా ప్రతినిధుల ముందు వాపోయారు. కబ్జాలు, కుట్రలు చేసే గుర్నాధరెడ్డి కి తమ నాయకుడు చంద్రబాబు సరసన నుంచుని అర్హత లేదని ప్రభాకర్ చౌదరి వాదన.
స్వయంగా చంద్రబాబు నచ్చజెప్పినప్పటికీ గుర్నాధరెడ్డి చేరిక వ్యవహారం మీద ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ తన అసంతృప్తి మొత్తం వెళ్లగక్కారు. జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి తప్ప ఇంకో టీడీపీ నాయకుడు ఎవరూ అవకాశవాద రాజకీయాలతో వస్తూన్న గుర్నాధరెడ్డిని అంగీకరించే పరిస్థితి లేదని ప్రభాకర్ అంటున్నారు. అందుకే గుర్నాధరెడ్డి చేరిక కార్యక్రమానికి దూరంగా ఉంటానని, ఆయనతో ఫోటో దిగడం కూడా తనకు ఇష్టం లేదని ప్రభాకర్ చౌదరి చెప్పారు. రాజకీయాల్లో మంచిగా ఉంటే పనికిరావడం లేదని ఆయన ఆవేదన చెందారు. అధినేత చెప్పాక కూడా ప్రభాకర్ స్వరం బలంగా వినిపించడం చూస్తుంటే అనంత రాజకీయాల్లో మున్ముందు పెద్ద రచ్చ తప్పదనే అనిపిస్తోంది.