తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక నేత, టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రత్యేకంగా భేటీ అయ్యారనీ వార్త ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. ఒకపక్క టీడీపీ నుండి వైసీపీకి వలసలు పెరిగిన నేపధ్యంలో ఎమ్మెల్యే ఆమంచి పార్టీ మారిన వెంటనే త్రిమూర్తులు కూడా పార్టీ మారతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపధ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తా అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ దిశగా పావులు కదుపుతున్నారా అనే అంశంపై ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు.
నిన్న మధ్యాహ్నం మంత్రి తలసానితో హైదరాబాద్‌లో తోట త్రిమూర్తులు భేటీ అయ్యారు. గత కొంతకాలంగా ఈయన వైఎస్సార్సీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పార్టీ మారే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి ముందు త్రిమూర్తులుతో భేటీ కావడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో మంత్రి తలసానితో తోట త్రిమూర్తులు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రాజకీయాలకు అతీతంగా వీరిరువురి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల ఏపీలో జరిగిన తోట త్రిమూర్తులు కుమారుడి వివాహ వేడుకకు తలసాని హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీపై తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలసాని తనకు సన్నిహితుడని మంత్రి అయినందుకు అభినందించేందుకే కలిశానని అన్నారు.