ఎంపీ పదవికి జేసీ గుడ్ బై… అందుకేనట ?

Jc Diwakar reddy resign to his MP post

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఆయన లోక్ సభ స్పీకర్ కి రాజీనామా లేఖ సమర్పించే అవకాశం వుంది. టీడీపీ లో చేరాక ఎన్నోసార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో సీఎం చంద్రబాబుకి తలనొప్పులు తెచ్చిన జేసీ ఇప్పుడు మరో సంచలనం సృష్టించారు. కొన్నాళ్లుగా రాజకీయాల పట్ల విముఖత ప్రకటిస్తున్న జేసీ తాజా స్టేట్ మెంట్ చూస్తే మాత్రం ఇది మాములుగా జరిగిన రాజీనామా కాదని ఎవరికైనా అర్ధం అవుతుంది. రాజీనామా కారణాల్ని వివరించేటప్పుడు జేసీ బాగా భావోద్వేగంతో కనిపించారు. ఇంతకీ ఆయన రాజీనామాకు చెప్పిన కారణాలు ఏమిటో చూద్దాం…

” ఓ ఎంపీ గా ఫెయిల్యూర్ అయ్యానని నా మనస్సాక్షి పదేపదే చెబుతోంది. ఎవరినైనా తప్పించుకోవచ్చు గానీ, మనస్సాక్షి నుంచి తప్పించుకోలేము. అందుకే రాజీనామా చేస్తున్నా. ఓ ఎంపీ గా నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఇక పదవిలో ఉండి ప్రయోజనం లేదు అనిపించింది. ఎన్నికలప్పుడు తాడిపత్రి నియోజకవర్గానికి నీళ్లు ఇస్తానని చేసిన హామీ నిలబెట్టుకోలేకపోయా. అనంతపురం అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డు పడుతున్నాయి.” అని జేసీ చెప్పిన మాటల్లో ఆవేశం ఉంది.

కొన్నాళ్లుగా కొడుకుని రాజకీయాల్లోకి దించి జేసీ రిటైర్ అయిపోతారని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు రాజీనామా కూడా అందుకే అనుకున్నప్పటికీ జేసీ టోన్ అలా లేదు. పైగా ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతానని జేసీ స్పష్టం చేశారు. తాను అనుకున్న పని ఏదైనా జరగకపోవడం వల్ల జేసీ ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది. అనంతపురం అసెంబ్లీ స్థానం కోసం ప్రభాకర్ చౌదరి తో సాగుతున్న వివాదంలో హైకమాండ్ ని వంచడానికి కూడా జేసీ ఈ రాజీనామా అస్త్రం ప్రయోగించివుండొచ్చని కూడా ఇంకో వాదన వినిపిస్తోంది.