బడ్జెట్ పై పార్టీల‌క‌తీతంగా నిర‌స‌న‌లు

TDP MPs protest in parliament

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై రాజ‌కీయ‌నాయ‌కులు పోరాటం ప్రారంభించారు. టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ బ‌య‌టా, కాంగ్రెస్ ఎంపీలు రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి ద‌క్కాల్సిన హామీలు, ప్ర‌యోజ‌నాల‌ను వెంట‌నే నెర‌వేర్చాల‌ని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్రహం వ‌ద్ద నిర‌స‌న‌కు దిగారు. ప్ల‌కార్డులు చేత‌ప‌ట్టి మాకు న్యాయం చేయండి… ప్ర‌ధాని దీనిపై స్పందించాలి అని నినాదాలు చేశారు. టీజీ వెంక‌టేశ్, తోట న‌ర‌సింహం, శివ‌ప్ర‌సాద్, రామ్మోహ‌న్ నాయుడు, నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌, గ‌ల్లా జ‌య‌దేవ్ తో పాటు టీడీపీ ఎంపీలంతా ఆందోళ‌నా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. విభ‌జ‌న బాధిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అర‌కొర నిధుల‌తో అభివృద్ధి సాధ్య‌ప‌డ‌ద‌ని, కేంద్రం విరివిగా నిధులిచ్చి ఆదుకోవాల‌ని ఎంపీలు కోరారు. విభ‌జ‌న హామీల అమ‌లు కోసం రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఎంతో ఆశ‌తో ఎదురుచూస్తోంటే నాలుగేళ్ల నుంచి నిరాశే మిగులుతోంద‌ని ఆవేద‌న‌వ్య‌క్తంచేశారు.

బ‌డ్జెట్ పై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రాజీలేకుండా పోరాడాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఢిల్లీలో ఉన్న ఎంపీల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై పార్ల‌మెంట్ బ‌య‌టా లోప‌లా తెలిసేలా నిర‌స‌న చేప‌ట్టాల‌ని ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. అటు కాంగ్రెస్ ఎంపీలు రాజ్య‌స‌భ‌లో బడ్జెట్ కు వ్య‌తిరేకంగా ఆందోళన జ‌రిపారు. కేవీపీ రామ‌చంద్ర‌రావు ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. స‌భాకార్య‌క‌లాపాల‌కు అడ్డు త‌గ‌లొద్ద‌ని, స‌భ నిర్వ‌హణ‌కు స‌హ‌క‌రించాల‌ని, రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ప‌లుమార్లు కోరినా… కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న విర‌మించ‌లేదు. ఏపీకి న్యాయం చేయ‌డంలో కేంద్రం విఫ‌ల‌మ‌యింద‌ని స‌భ్యులు ఆరోపించారు. కాంగ్రెస్ స‌భ్యుల నిర‌స‌న‌తో వెంక‌య్య రాజ్య‌స‌భ‌ను వాయిదావేయాల్సి వ‌చ్చింది