నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఆ కుటుంబానికి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలని చంద్రబాబు భావించారని అప్పట్లో ప్రచారం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌ను పొలిట్‌బ్యూరో సభ్యునిగా తీసుకుంటారని ఆ తర్వాత ఎన్నికా హడావిడి మొదలయ్యాక కల్యాణ్‌రాంకు శేరిలింగంపల్లి, లేదా జూబ్లీ హిల్స్ బరిలో నిలుపుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరూ రాజకీయాలపై ఆసక్తి లేనట్లుగా ఉన్నారు. ఈ క్రమంలో హరికృష్ణ కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఆయన కుమార్తెకు ఇస్తే ఆలోచన ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తోంది.
తాజాగా తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారయ్యింది. రెండు నెలల కిందటే టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించగా, మహాకూటమిగా పోటీచేస్తోన్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. 65 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించగా, తమకు కేటాయించిన 14 స్థానాలకుగానూ టీడీపీ 9 మందిని ఖరారు చేసింది. అయితే, హైదరాబాద్ నగరంలో కీలకమైన కూకట్‌పల్లి నియోజకవర్గం సీటు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దివంగత నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారంటూ వార్త హల్‌చల్ చేస్తోంది.
రాజమండ్రి మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి తనయుడు శ్రీకాంత్ భార్య సుహాసిని. టీడీపీ అధినేత నారా చంద్రబాబు వద్ద కూడా ఈ విషయం చర్చించినట్టు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం… తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని భవ్య ఆనందప్రసాద్‌కు, కూకట్‌పల్లి స్థానాన్ని సీనియర్ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డికి ఇవ్వాలని చెప్పినట్లు ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే భవ్య ఆనందప్రసాద్‌కు శేరిలింగంపల్లి టిక్కెట్‌ను ఖరారు చేశారు.. కానీ కూకట్‌పల్లి విషయాన్ని మాత్రం పెండింగ్‌లో ఉంచారు. కూకట్‌పల్లిలో పెద్దిరెడ్డి అభ్యర్థిత్వంపై.. అక్కడి క్యాడర్‌లో సానుకూలత రాలేదన్న కారణం ప్రచారం అయింది. అంతే కాక అసలు ఏమాత్రం ఊహకి అందకుండా హఠాత్తుగా హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి మీడియాకు టీడీపీ వర్గాలు లీకులిచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కూకట్‌పల్లిలో సానుకూలత వ్యక్తమైతే నామినేషన్లకు ఎంతో సమయం లేదు..కాబట్టి ఒకటి, రెండు రోజుల్లోనే ఆమె అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఉంది.