అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వ స్థలంలో దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై మొదలయిన వాగ్వాదం ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, బాటిళ్లతో దాడి చేసుకునే దాకా వెళ్ళింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే పుట్లూరు మండలంలోని కుమ్మనమలలో బస్టాండ్ ముందు టీడీపీ వర్గీయులు ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంచాయితీ స్థలంలో షాపు పెట్టడం ఏంటని వైసీపీ నేతలు నిలదీశారు.
ఈ వాగ్వాదం ఇరువర్గాల మధ్య పెద్దదయి ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు, కర్రలు, బాటిళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో టీడీపీకి చెందిన రామాంజనేయులు, బయన్న, వైసీపీకి చెందిన హరిబాబు, శంకర్, రామాంజినేయులు, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిందరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్డీఓ మలోల పంచాయితీ స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించారు. ఈ ఘటనలో గాయపడ్డవారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.