ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలుగుదేశం కంచుకోటగా నిలిచింది. ఎంతో మంది కీలక నాయకులు ఉండేవారు. కానీ, తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక పరిస్థితులు పూర్తిగా మారాయి. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం రాజకీయ పార్టీలను కకావికలం చేసింది.
టీడీపీని అయితే కోలుకోలేని దెబ్బ తీసింది. మలి దశ ఉద్యమ ఆరంభమైన నాటి నుండే చంద్రబాబు వైఖరితో తెలంగాణలో టిడిపి పార్టీ పతనం మొదలైంది. రాష్ర్ట అవరతణతో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకంగా ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చింది.
తెలంగాణలో పాగా వేయాలనుకున్న బీజేపీ ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష తెలుగుదేశానికి గట్టిగా తగిలింది. గులాబీ పార్టీలో చేరడానికి ఇష్టం లేని నాయకులు కాషాయ కండువ కప్పుకుంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయింది.
ఒకప్పుడు టీడీపీలో కీలక నేతలైన కడియం శ్రీహరి, ఎర్రబెలి దయాకర్ రావు, సిరికొండ మధుసుదనాచారి, ఆజ్మీరా చందులాల్, చల్లా ధర్మరెడ్డి, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, గుండు సుధారాణి, కత్తుల రాజిరెడ్డి, స్వర్గీయ యతిరాజారావు లాంటి ఎందరో నేతలు సైతం ఒక్కొక్కరు పార్టీని వీడారు.
టీఆర్ఎస్లో చేరి ప్రస్తుతం కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సీనియర్ నేతలు వెళ్లిపోయినా.. వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల క్యాడర్ మాత్రం అలాగే ఉంది. మరికొందరు నేతలు టీడీపీలోనే ఉండి తమ అదృష్టాన్ని ఇంకా పరీక్షించుకుంటున్నారు.
ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలకు తోడు బీజేపీ వ్యూహాలకు టిడిపి కుదేలవుతోంది. తాజాగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఈ ప్రభావం ప్రస్తుతం ఉన్న పార్టీ క్యాడర్‌పై పడింది.
గరికపాటి మెహన్ రావు ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం, జనగామ, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు బొట్ల శ్రీనువాస్, చాడ రఘునాధ్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన చాలా మంది నేతలు బీజేపీలో చేరిపోవడంతో వరంగల్ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యిందంటున్నారు ఆ పార్టీ మాజీ నేతలు. మిగిలిన ఒక్కరిద్దరు నేతలు కూడ త్వరలోనే బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. త్వరలోనే రేవూరి ప్రకాష్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.