కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తుంది. కరోనా ద్వారా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ అంతా ఛిన్నాభిన్నమైంది. షేర్ మార్కెట్లు కోలుకోలేని నష్టాల్లోకి చేరాయి. తాజాగా షేర్ మార్కెట్లో నష్టాలు రావడంతో తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు.
నల్గొండలోని హిమగిరికాలనీకి చెందిన మల్ల శ్రీనివాస్‌రెడ్డి (45) గుర్రంపోడ్ మండలం మైలపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. అయితే ఆయన అందులో నష్టాలు చవిచూడటంతో తట్టుకోలేకపోయాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా రోజు ఆయనను వేధిస్తున్నాయి. ఇక జీవితంపై విరక్తి చెందిన ఆయన తాజాగా స్కూటీపై తిప్పర్తి మండలంలోని రాయినిగూడేనికి చేరుకున్నాడు. అక్కడ గ్రామ శివారులోని ఓ రైసుమిల్లు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే షేర్ మార్కెట్ నష్టాలే తన ఆత్మహత్యకు కారణమని.. తనను క్షమించాలని రాసి ఉంచిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆయనకు భార్య సునీత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.