“మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. అంటే, గురువు పరబ్రహ్మ స్వరూపమనని మన పెద్దల విశ్వాసం. అందుకే తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని వారి నమ్మకం. అంతేకాక “గురువు” అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాలకోసం గుళ్ళూ, గోపురాల చుట్టూ తిరగడం భలే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది.
టీచర్లను గౌరవించడానికి కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. మన దేశానికొస్తే సెప్టెంబర్ 5నే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్ట్రపతిగా అద్వితీయంగా తన పదవీ బాధ్యతలను నిర్వహించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) జన్మదినం కావడమే. 1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. 1962లో భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతులు చేపట్టిన రాధాకృష్ణన్ వద్దకు కొంత మంది విద్యార్థులు, మిత్రులు వెళ్లారు.
పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వారు రాధాకృష్ణన్ కోరారు. అందుకు సమాధానంగా ఆయన తన పుట్టిన రోజు వేడుకలు జరపడం కంటే ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు జరపడం తాను ఆనందంగా భావిస్తానని చెప్పడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేకమంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రయత్నం మానవ లక్షణం అలా విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడనే వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.
ఆధ్యాత్మిక బోధకుడికి, భౌతిక విషయాలు బోధించే ఉపాధ్యాయుడికి మధ్య తేడా ఉంది. ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడి ఆలోచనల నుంచి భ్రమలు తొలగించి ఆధ్యాత్మిక దిశగా మళ్లిస్తాడు. దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలెత్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన భారతీయ సంప్రదాయంలో ఉంది. తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపు దిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చి దిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు.
అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరించడం దేశాన్ని గౌరవించడం, సత్కరించడమే అని చెప్పవచ్చు. మాజీ రాష్ట్రపతి కలాం కూడా గతంలో ఉపాధ్యాయుడే. పదవీ విరమణ అనంతరం ఆయన మరలా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారంటే ఆ ఒక్క ఉదాహరణ చాలు ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్నీ, విశిష్టతను తెలియజేస్తుంది. ప్రపంచంలో “సర్” అని ప్రతిఒక్కరూ సంబోధించతగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దేశాధ్యక్షుడు సైతం “సర్” అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో.