Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
” నేనే రాజు నేనే మంత్రి” సినిమాకి ముందు కొన్నేళ్లు పాటు దర్శకుడు తేజకి సక్సెస్ దక్కలేదు. ఆయనతో సినిమా చేయడానికి స్టార్స్ కాదు కదా చిన్న హీరోలు కూడా పెద్దగా ఇంటరెస్ట్ చూపలేదు. రొటీన్ ప్రేమ కధల కన్నా తేజ కొత్తగా ఏమీ చేయలేడన్న ఓ ముద్ర పడిపోయింది. దీన్నుంచి బయటపడేందుకు, దర్శకుడు తేజ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ” నేనే రాజు నేనే మంత్రి ” కథతో నిర్మాత సురేష్ బాబుని ఒప్పించడమే ఓ సంచలనం. అంత తేలిగ్గా సినిమా ఓకే చేయని సురేష్ బాబు ఈ కధని ఒప్పుకోవడంతో పాటు రానా తో దాన్ని తీశారు. భారీ హిట్ కొట్టారు. లాభాలు పట్టారు. అయితే అప్పటికి తేజకి వున్న ఇమేజ్ ప్రకారం నామినల్ రెమ్యునరేషన్ ఇచ్చి వచ్చిన లాభాల్లో షేర్ ఇచ్చేట్టు ఒప్పందం చేసుకున్నారు. అలా తేజకి బాగానే గిట్టుబాటు అయ్యింది. స్టార్ దర్శకులు భారీ రెమ్యునరేషన్స్ తీసుకుని ఫలితాలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న తరుణంలో ఇది ఓ కొత్త పరిణామం. దర్శకుల్లో బాద్యతని పెంచే ఆరోగ్యకర పరిణామం.
తేజ కొత్తగా ఒప్పుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారట. ఇప్పటికే తేజకి సాయి కొర్రపాటి ద్వారా అడ్వాన్స్ కూడా అందిందట. ఈ సినిమాకి కూడా ప్రస్తుతం కొద్ది మొత్తం ఇచ్చి వచ్చే లాభాల్లో తేజకి వాటా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా తేజ అనుసరిస్తున్న ఈ విధానం ఫాలో అయితే చాలా మంది ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణం, ఫలితం విషయంలో మరీ ఎక్కువగా టెన్షన్ పడే అవకాశం ఉండకపోవచ్చు. సినిమా సక్సెస్ అయితేనే తనకు కూడా మేలు జరుగుతుందని దర్శకుడికి ముందుగా క్లారిటీ ఉంటే ఆ పనితీరులో కచ్చితంగా తేడా ఉంటుంది. కాదంటారా ?