Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర క్రీడల శాఖమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మొదలుపెట్టిన ఒక చాలెంజ్ ఇప్పుడు క్రీడాస్ఫూర్తిని మించి రాజకీయ చాలెంజ్ వరకు వెళ్ళింది. రాథోడ్ మొదట తాను పలు వ్యాయామాలు చేసిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా షట్లర్ సైనా నెహ్వాల్ హీరో హృతిక్ రోషన్ లకు ‘ఫిట్ నెస్ చాలెంజ్’ను చేశాడు. సైనా నెహ్వాల్ ఈ చాలెంజ్ ను స్వీకరించి బరువులు ఎత్తుతున్న వీడియోను పోస్టు చేసింది. ఆమె క్రికెటర్ గంభీర్, పీవీ సింధు, రాణా దగ్గుబాటిలకి చాలెంజ్ విసరగా క్రీడల మంత్రి చాలెంజ్ కు రియాక్ట్ అయిన కోహ్లీ కూడా జిమ్ లో తాను పలు ఎక్సర్ సైజ్ లు చేసి ఆ వీడియోను షేర్ చేశాడు. తాను ఫిట్ నెస్ చాలెంజ్ ను స్వీకరించానని.. ప్రధాని మోడీ – భార్య అనుష్క – సహచర క్రికెటర్ ధోనిలకు ఈ చాలెంజ్ విసిరాడు..
కోహ్లీ చాలెంజ్ ను స్వీకరించిన ప్రధాని మోడీ కూడా తాజాగా త్వరలోనే ఈ ఫిట్ నెస్ వీడియో పోస్టు చేస్తానని ట్విట్టర్ లో పేర్కొనడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కోహ్లీ చాలెంజ్ కు ప్రధాని స్పందించడంపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి – లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తనదైన శైలిలో దెప్పి పొడిచాడు. కోహ్లీ విసిరిన ఛాలెంజ్ ను మీరు స్వీకరించడం పట్ల ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలు లేవని… మరి, మా ఛాలెంజ్ ను కూడా స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. రైతులకు ఉపశమనం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, దళితులు, మైనార్టీల పట్ల హింస తదితర సవాళ్లను కూడా మీరు స్వీకరించాలని కోరుతున్నామని చెప్పారు. ‘మా ఛాలెంజ్ ను స్వీకరిస్తారా మోదీ సార్?’ అని ప్రశ్నించారు. ఇప్పుడీ రాజకీయ చాలెంజ్ పై ప్రధాని స్పందించలేదు. ఎదో ఎంటర్తైన్మెంట్ కోసం చేసే చాలెంజ్ లు అయితే స్వీకరిస్తారు కానీ ఇలా రాజకీయ చాలెంజ్ లు స్వీకరించే దమ్ము లేదంటూ కొందరు నెటిజన్లు మోడీ మీద పంచ్ లు వేస్తున్నారు. చూడాలి మరి మోడీ సారు తేజస్వి చాలెంజ్ కి ఏమని ఆన్సర్ చేస్తారో.