తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కేసీఆర్ భేటీ అయిన ఆయన తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. అయితే తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం, మధురై తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగొచ్చేశారు. తాజాగా వీరిద్దరి భేటీకి రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి కుటుంబసభ్యులు, పార్టీ ముఖ్య సభ్యులతో కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం శ్రీరంగం, తిరుచ్చిలోని పలు ఆలయాలను సందర్శించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు స్టాలిన్‌తో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తారని అంటున్నారు. అయితే డీఎంకే తొలినుంచీ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తోంది, అందుకే యూపీఏ ప్రభుత్వంలో పలువురు డీఎంకే ఎంపీలు కేంద్రమంత్రి పదవులు అనుభవించిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో కూడా ఆ పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతోంది. మరోవైపు బీజేయేతర పక్షాలను ఏకం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సైతం స్టాలిన్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆయన డీఎంకే తరపున ప్రచారం కూడా చేశారు. దీంతో కేసీఆర్ బీజేపీ- కాంగ్రెసేతర ఫ్రంట్‌కు స్టాలిన్ మద్దతిస్తారో? లేదో? చూడాలి.