తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్… ‘హ్యాండి’చ్చిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు…!

Telangana Congress MLC Leaders Joins In TRS

ఓటమి షాక్‌ నుంచి తేరుకోకముందే కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌లు గురువారం రాత్రి వేర్వేరుగా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.దాదాపు గంటపాటు వీరు భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే వీరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ముగిసిన శాసనసభ ఎన్నికల్లో ఆకుల లలిత కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆర్మూర్‌లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక, కరీంనగర్‌ జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆయన టీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు హామీ లభించినట్లు తెలుస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతిరెడ్డి, యాదవరెడ్డి, కొండా మురళి, రాములు నాయక్‌ ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేశారని, వారిపై అనర్హత వేటు వేయాలని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ విప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై టీఆర్‌ఎస్‌లో చేరిన కె.దామోదర్‌ రెడ్డి పై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. మండలిలో కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌తో కలిసి మండలిలో కాంగ్రెస్‌ విప్‌ ఆకుల లలిత చైర్మన్‌ స్వామిగౌడ్‌ కార్యాలయానికి బుధవారం వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో నిన్న ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కానీ, బెంగళూరులో ఉన్న స్వామిగౌడ్‌ నిన్న కూడా రాలేదు. శుక్రవారం ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈలోపలే ఆకుల లలిత, మరో ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌ ప్రగతి భవన్లో దర్శనం ఇవ్వడం కాంగ్రెస్ అగ్ర నాయకులకి మింగుడుపడడం లేదు. ప్రస్తుతానికి తెలంగాణ శాసనమండలిలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్సీల్లో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలిత, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి, ఎం.ఎస్ ప్రభాకర్ ఉన్నారు. వీరిలో దామోదర్ రెడ్డి, ఎం.ఎస్ ప్రభాకర్ ఇప్పటికే టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా కొనసాగుతుండగా, తాజాగా ఆకుల లలిత, సంతోష్‌కుమార్ టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా దామోదర్ రెడ్డి, ఎం.ఎస్ ప్రభాకర్, సంతోష్‌ కుమార్ ఈరోజు స్వామిగౌడ్‌ను కలిసి కాంగ్రెస్ మండలి పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ స్వామిగౌడ్‌కు లేఖ అందజేశారు. ఇక కాంగ్రెస్‌లో మిగిలింది షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే. వీరి పదవీ కాలం కూడా మార్చిలో ముగియనుంది. అంటే ఒకరకంగా ఈసారి మండలిలో కాంగెస్ కి గడ్డు కాలమే.