Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణలో జూన్ 2న జరిగే 4వ తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించటానికి కలెక్టర్లు సన్నద్ధం అయ్యారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇప్పటికే రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. రాజ్ భవన్, సచివాలయం, అసెంబ్లీ, రవీంద్ర భారతి, హైకోర్టు, చార్మినార్, నెక్లేస్ రోడ్, ట్యాంక్ బండ్ విద్యుత్ దీపాలతో అలంకరించారు. సిటీని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు బల్దియా అధికారులు.
అన్ని ప్రభుత్వ శాఖలు అవతరణ దినోత్సవాలకు తమ పరిధిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కళారూపాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పరేడ్ గ్రౌండ్లో వేడుకలకు 2500 మంది పోలీసులు సహా భారీస్థాయిలో ఆక్టోపస్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బలగాలు నిరంతరం భద్రతను సమీక్షిస్తున్నాయి. జూన్ 2వ తేదీ ఉదయం 9:30 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది.
పాసులు ఉన్నవారికి మాత్రమే పరేడ్ గ్రౌండ్ లోకి అనుమతిస్తారు. సూచించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. పరేడ్ గ్రౌండ్స్‌లో మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు ఏర్పాటు చేశారు. మంచినీటి సరఫరాతోపాటు అంబులెన్స్ లు కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవానికి వచ్చే వారికి నోరూరించే రుచులు అందించాలని నిర్ణయించారు. తెలంగాణ స్పెషల్ వంటకాలతో మెనూ సిద్ధం చేశారు అధికారులు. వెజ్, నాన్ వెజ్ రుచులు నోరూరించనున్నాయి. ఇక జూన్ 2న పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.