తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ 3,584 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. చివరి రోజు అత్యధికంగా 2,087 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, కూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు తమకు కేటాయించిన స్థానాల్లోనే కాకుండా మిత్రుల సీట్లలోనూ నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పేలాలేదు. అయితే, నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే దీనిపై ఓ స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి 14 సీట్లను కేటాయించగా, కేవలం 13 చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒక సీటును టీడీపీ వదులుకోవాల్సి వచ్చింది. దీనిపై ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడమే టీడీపీ లక్ష్యమని వ్యాఖ్యానించారు కూటమి ప్రయోజనాలను కాపాడే క్రమంలోనే తమకు కేటాయించిన 14వ స్థానాన్ని వదులుకున్నామని ఆయన తెలిపారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీలో రెబెల్స్ లేరని ఆశావహులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.
ఆశావహులంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని రావుల వెల్లడించారు. అయితే పొత్తుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం సీటును టీడీపీకి దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డికి బీఫారం ఇచ్చారు. అయితే, ఈ స్థానం నుంచి పోటీకి సామ ముందు నుంచి ఆసక్తి చూపడం లేదు. తనకు ఎల్బీనగర్ సీటు కావాలంటూ అధినేత చంద్రబాబును కోరారు. కానీ, ఆయన కూడా సర్దుకుపోవాలని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నామినేషన్ వేశారు. సామ రంగారెడ్డికి టీడీపీ టికెట్ ఖరారు చేసి బీఫాం ఇచ్చినా అభ్యర్థిత్వం మార్పుపై చర్చలు ఇంకా కొనసాగడంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కూటమి తరఫున పోటీ చేయడంపై సామ రంగారెడ్డి ఆది నుంచి సుముఖంగా లేకపోవడంతో పాటు తర్వాత జరిగిన పరిణామాలతో అభ్యర్థిని మార్చాలని టీడీపీ, కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో ఎలాగైనా విజయం సాధించాలని దృడనిశ్చయంతో ఉన్న ప్రజాకూటమి అవసరమైతే అభ్యర్థిని మార్చే విషయం పరిశీలిస్తోంది.
టీడీపీ నుంచి కూటమి తరఫున సామ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరఫున నామినేషన్ వేశారు. అలాగే ఆయన సోదరుడు మల్‌రెడ్డి రామిరెడ్డి కూడా ఎన్సీపీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఈ నేతలిద్దరూ అనూహ్యంగా బీఎస్సీ, ఎన్సీపీల నుంచి నామినేషన్లు దాఖలు చేయడంతో వారి అనుచరులు ఖంగుతిన్నారు. ఈ నేపథ్యంలో వీరిలో బలమైన నేతను అభ్యర్థిగా ప్రకటించే విషయంపై కూటమి నేతలు సోమవారం చర్చించారు. సామ రంగారెడ్డి పోటీపై ఆసక్తి చూపకపోవడంతో పాటు ఆయన్ను స్థానిక టీడీపీ నేత రొక్కం భీమ్‌రెడ్డి వ్యతిరేకించడంతో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. దీంతో పాటు టికెట్ విషయంలో సామ ఓ వ్యక్తితో ఫోన్‌లో సంభాషిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి నష్టం చేకూర్చేలా మారాయి. మరోవైపు, కూటమి తరఫున మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు రామిరెడ్డి బరిలోకి నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీపీ తరఫున నామినేషన్ వేసిన ఆయన మరో సెట్ స్వతంత్ర అభ్యర్థిగా కూడా వేశారు. ఇక, 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రామిరెడ్డి ప్రధాన పార్టీలకు ధీటైన అభ్యర్ధిగా నిలిచి రెండో స్థానంలో నిలిచారు. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 48,397 ఓట్లు రాగా, స్వతంత్రుడిగా బరిలో దిగిన మల్‌రెడ్డి రామిరెడ్డికి 37,341 ఓట్లు లభించాయి. సర్వేలు కూడా రామిరెడ్డికి అనుకూలంగా ఉండడంతో ప్రజాకూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్నే బరిలో ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. మంగళవారం సామ, మల్‌రెడ్డి రంసోదరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూటమి నేతలు వెల్లడించారు.