తెలంగాణలో మే 28వరకు లాక్ డౌన్ తప్పదా.. పరిస్థితులు చూస్తుంటే అనివార్యం అనిపిస్తుంది. కరోనా కేసులు ఒకరోజు తగ్గడం, మరొకరోజు పెరుగుతున్న ఈ సమయంలో లాక్డౌన్ పొడిగించడమే శ్రేయస్కరమని ఆరోగ్యశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. దీంతో ఈ నెల 28వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావం కారణంగా మార్చి 22న రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైరస్‌ను అదుపు చేసేందుకు కనీసం 70 రోజుల లాక్డౌన్ అవసరమని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కూడా 70 రోజుల సైకిల్ పూర్తిచేయడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం అదంతుంది. అందుకు తగినట్లుగానే అధికారులు వైద్యాధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
ఈ 70 రోజుల సైకిల్ సుమారుగా మే 28తో పూర్తవుతుంది. గతంలో స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు సోకినప్పుడు కూడా 70 రోజుల సైకిల్‌ను పాటించినట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యశాఖ సిఫారసుమీద ఈరోజు జరగబోయే సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కరోనా కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా పూర్తిస్థాయిలో అమలుచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మిగిలిన జిల్లాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సడలింపులివ్వనున్నారు.