తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి నెల దాటకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. మొదటి విడత నామినేషన్ల పర్వం ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యింది. మొత్తం 197 మండలాల్లో 4480 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులు, ఆ మండలాల పరిధిలోని 39,832 వార్డు పదవులకు నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్‌లను స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించి రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకే చోట ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఇతర సిబ్బందిని నియామించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ నెల 9 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10న నామినేషన్లను పరిశీలించి ఆ తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత 11న నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరించి, 12న వాటిని పరిష్కరిస్తారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు 13 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి ఓట్లను లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. పంచాయతీల్లో ఒకటి కంటే ఎక్కువ వార్డులకు పోటీ చేయడం కుదరదని అధికారులు చెబుతున్నారు. రెండు చోట్ల నామినేషన్ వేసినా ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ఒకటి ఎంచుకుని మరొక చోట నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. సర్పంచ్‌గా పోటీ చేసే వ్యక్తి వార్డు మెంబర్‌గానూ పోటీ చేయొచ్చు. రెండు పదవుల్లోనూ విజయం సాధిస్తే నిర్ణీత గడువులోగా ఏదొక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా వార్డు మెంబర్, సర్పంచ్ పదవులకు పోటీ చేయొచ్చు.