తెలంగాణపై చలి పంజా విసిరింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా పడిపోవడంతో పగటిపూట కూడా చలి ఎక్కువగా ఉంటోంది. చలి దెబ్బకు చిన్నారులు, వృద్ధులు వణికిపోతున్నారు. ఇళ్లలో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. రేపటి నుంచి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్, భద్రాచలం, భూపాలపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం అసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, వారికి అవసరమైన మందులు, దుస్తులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో సీఎస్ జోషి కూడా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అవసరమైన మందులు, దుస్తులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సాయం అందించాలని సూచించారు. స్థానిక నేతలతో పాటూ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందంటోంది వాతావరణ శాఖ. పెథాయ్ తుపాను ప్రభావం కూడా రాష్ట్రంపై పడిందంని తెలిపారు. దీంతో పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోందని చెబుతున్నారు.