Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణా స్పీకర్ మధుసూదనాచారి పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డారు. భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో స్పీకర్ కాన్వాయిలోని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. తన నియోజవర్గంలోని గణపురం నుంచి భూపాలపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గణపురం మండల కేంద్రంలో స్పీకర్ మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి నాగలి పట్టి దుక్కిదున్నారు.
పర్యటనను ముగించుకుని తిరిగి వస్తుండగా దేవాదుల పైపులను తీసుకువస్తున్న రెండు లారీలు ఎదురుగా వస్తున్న స్పీకర్ కాన్వాయ్ వాహనాలను ఢీకొట్టాయి. బలంగా ఢీకొట్టడంతో వాహనం రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు స్పీకర్‌ను క్షేమంగా గమ్యానికి చేర్చారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జనుజ్జు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పీకర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.