కురుక్షేత్రాన్ని తలపించిన ప్రజాస్వామిక యుద్ధం ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఏప్రిల్ 11 న పోలింగ్ అయిపోయింది. గెలుపు మీద ఇటు అధికార పక్షం , అటు ప్రతిపక్షం ధీమాగా వున్నాయి. రెండు పార్టీలు కూడా 100 కి పైగా సీట్లు మావే అంటూ డంకా బజాయిస్తున్నాయి. టీడీపీ , వైసీపీ చేస్తున్న ఈ ప్రకటనలు నిజంగా ఆ పార్టీలు పూర్తి స్థాయిలో నమ్ముతున్నవే . అందుకే అసలు ఫలితం ఎలా ఉంటుందా అన్న సంశయం . ఎవరికి షాక్ తగులుతుందో అన్న సందేహం. ఎన్నికలు పూర్తి అయిన ఇన్ని రోజులకి కూడా ఇద్దరిలో ఈ స్థాయి నమ్మకం కనిపించడం ఆశ్చర్యకరమే.
కానీ అందుకు ఎవరి కారణాలు వారికి వున్నాయి. ఈ రెండు పార్టీలని ఇంతగా నమ్మేలా చేసిన సగటు ఓటరు మదిలో ఏముంది ? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు తెలుగు బులెట్ ఓ వినూత్న ప్రయత్నం చేసింది. ప్రధాన పార్టీల మద్దతుదారులు , సానుభూతిపరులు కన్నా న్యూట్రల్ ఓటర్ అంతరంగానికి ఎక్కువ విలువ ఇచ్చేలా సరికొత్త పద్ధతిలో క్షేత్ర స్థాయి సమాచారాన్ని సేకరించింది. పల్లె పల్లెను పలకరించింది. పట్టణ ఓటరు మనసులో ఏముందో రాబట్టింది. గుట్టుగుట్టుగా సాగిన ఓటరు ప్రస్థానపు అడుగులు ఎటు పడ్డాయో విశ్లేషణ చేసింది. ఇది సర్వే కాదు. అంతకు మించి సగటు ఆంధ్రుడి అంతరంగ మధనం., బయటికి వచ్చిన ఫలితమేంటో చూద్దామా !
తెలుగు దేశం ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర టీడీపీ కి కంచుకోట. అయితే 2004 లో ఆ కంచుకోటకి వై.ఎస్ తూట్లు పొడిచారు. 2009 లో అక్కడ కోలుకుంటున్న టీడీపీ కి పీఆర్ఫీ రూపంలో ఇంకో దెబ్బ తగిలింది. రెండు సార్లు వరస ఓటములు తర్వాత శ్రీకాకుళం , విజయనగరం , విశాఖ జిల్లాల్లో టీడీపీ కి పూర్వ వైభవం వచ్చింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ని ఉత్తరాంధ్ర ఓటరు తిరిగి కరుణించినట్టే కనిపిస్తోంది. 2009 ఎన్నికల్లో చిరు ప్రజాకర్షణ , చంద్రబాబు పోరాట పటిమను తట్టుకుని వై.ఎస్. చేపట్టిన పధకాలు కాంగ్రెస్ ని గెలుపు బాటలో నడిపించాయి. ఇప్పుడు కూడా అదే ఒరవడి కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ పధకాల ముందు పవన్ చరిష్మా , జగన్ పోరాటం నిలబడినట్టు లేదు. చరిత్ర పునరావృతం అవుతుంది అన్న నానుడి నిజమో ,కాదో గానీ కులాల పరంగా చూసినప్పుడు క్షేత్ర స్థాయిలో పెద్దగా మార్పులు లేవు.
2009 లో పీఆర్ఫీ అనుభవంతో కాబోలు తూర్పు కాపులు ఈసారి పవన్ మీద ఆసక్తి ప్రదర్శించారు తప్ప ఆకర్షణకి లోను కాలేదు. ఇక జగన్ చెప్పిన మాటలు కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు వచ్చిన తుఫాను సమయంలో జగన్ ప్రతిస్పందన ఉత్తరాంధ్రుల్ని నిరాశపరిచింది. ఇక అటు ఇటు జరిగిన కొందరు నాయకులు కూడా పార్టీల ముందు , అధినాయకుల క్రేజ్ ముందు తేలిపోయారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీ లో కొందరు గట్టి నాయకులు సైతం వ్యక్తిగత స్థాయిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో పాటు టీడీపీ ప్రభుత్వ పధకాల లబ్ధిదారులకి సహజ రాజకీయ విమర్శలు పెద్దగా ఎక్కలేదు. ఇక చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలాగైనా దించాలి , జగన్ ని ఎలాగైనా గద్దెని ఎక్కించాలి అని వైసీపీ నాయకులు , కార్యకర్తలు భావించినట్టు సామాన్య ఓటరు అనుకునేందుకు పెద్ద కారణాలు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులు , ఫలితాలు ఇలా వుండే అవకాశం వుంది.
శ్రీకాకుళం ….మొత్తం స్థానాలు ——10 .
టీడీపీ గెలిచే స్థానాలు ————5 ( పలాస , టెక్కలి, పాతపట్నం , ఎచ్చెర్ల ,రాజాం )
వైసీపీ గెలిచే స్థానాలు ————2 . (శ్రీకాకుళం , నరసన్నపేట )
పోటాపోటీ స్థానాలు ————-3 ( ఇచ్చాపురం , ఆముదాలవలస , పాలకొండ )
పోటాపోటీ అనుకుంటున్న మూడు స్థానాల్లో రెండు చోట్ల టీడీపీ కి , ఒక చోట వైసీపీ కి గెలుపు ఛాన్స్ వుంది .
విజయనగరం …మొత్తం స్థానాలు ——9 .
టీడీపీ గెలిచే స్థానాలు —————5 ( పార్వతీపురం , బొబ్బిలి , గజపతినగరం , విజయనగరం , శృంగవరపుకోట )
వైసీపీ గెలిచే స్థానాలు ————-1 ( చీపురుపల్లి )
పోటాపోటీ స్థానాలు —————3 ( కురుపాం , సాలూరు , నెల్లిమర్ల )
పోటాపోటీ అనుకుంటున్న మూడు స్థానాల్లో రెండు చోట్ల వైసీపీ కి , ఒక చోట టీడీపీకి గెలుపు అవకాశం వుంది.
విశాఖ ….మొత్తం స్థానాలు ————-15 .
టీడీపీ గెలిచే స్థానాలు ——————8 ( విశాఖ ఈస్ట్ , విశాఖ వెస్ట్ , విశాఖ నార్త్ , చోడవరం , మాడుగుల , పాడేరు , యలమంచిలి , పాయకరావు పేట )
వైసీపీ గెలిచే స్థానాలు ——————-1 ( అరకు )
జనసేన గెలిచే స్థానాలు ——————1 ( గాజువాక )
పోటాపోటీ స్థానాలు ———————5 ( విశాఖ సౌత్ , భీమిలి , అనకాపల్లి , పెందుర్తి , నర్సీపట్నం )
పోటాపోటీ స్థానాల్లో 3 , 2 స్థానాలు వైసీపీ , టీడీపీకి వచ్చే అవకాశం వుంది. మొత్తంగా ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు గాను 23 చోట్ల టీడీపీ , 10 చోట్ల వైసీపీ , ఒక స్థానంలో జనసేన జయకేతనం ఎగురవేస్తాయి.
రేపు ఉభయ గోదావరి జిల్లాల రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.