మాజీ మంత్రి కాకినాడకు చెందిన ముత్తా గోపాలకృష్ణ, ఆయన కుమారుడు ముత్తా శశిధర్ జనసేన పార్టీలో చేరారు. వీరితో పాటు వాళ్ల అనుచరులు 500 మంది కూడా పార్టీలో చేరారు. హైదరాబాద్ మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి పవన్ కల్యాణ్ తన పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, టీడీపీ కార్పొరేటర్ మాకినీడు శేషుకుమారి తదితరులు కూడా ఆయన వెంట పవన్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పార్టీకి యువశక్తితో పాటు అనుభవజ్ఞులు చాలా అవసరమని, రాజకీయాల్లో పరిపూర్ణ అవగాహన ఉన్న ముత్తా గోపాలకృష్ణ లాంటి వారు ‘జనసేన’లోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన ఆయన అనుభవం.. పార్టీకి, సమాజానికి మంచి చేయాలని పరితపించే జనసైనికులకు దిశానిర్దేశం చేస్తుందని, అందుకే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆయనకు స్థానం కల్పిస్తున్నట్టు చెప్పారు. పార్టీ పాలసీల్లో వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన అధినేత రాజకీయాల్లో ఏదో మార్పు తేవాలని వచ్చారు ఆయనకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. నా జిల్లాకి, పట్టణానికి ఎంతో అన్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ అడిగితే చెప్పానని అలాగే సినిమాల్లో పవన్ చూసి చాలా ఆవేశపరుడు అనుకున్నానని కానీ రియల్ గా ఆయన్ను చూశాక ఆయనో గొప్ప వ్యక్తి, మంచి మనసున్న మారాజు అని తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పవన్ ఇప్పటికే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు స్థాయికి ఎదిగిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ అభిప్రాయాలు, ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని తానూ జనసేన పార్టీకి అండగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.