అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిబద్ధత, గుండెధైర్యం ప్రదర్శిస్తూ గొప్ప విజయాలు అందించినందుకుగాను భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తగిన గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికిగాను ఆసియా ఓసియానియా జోన్‌లో సానియా మీర్జాకు ఫెడ్ కప్ హార్ట్ పురస్కారం దక్కింది. ఈ అవార్డు గెల్చుకున్న తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా సానియా నిలిచింది. ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్ టోర్నీలో భాగంగా… దుబాయ్‌లో మార్చిలో జరిగిన ఆసియా ఓసియానియా జోన్ క్వాలిఫయర్స్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచి, తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించడంలో సానియా మీర్జా కీలకపాత్ర పోషించింది.
ఏడాదిన్నర వయస్సున్న తనయుడు ఇజ్‌హాన్‌ను వెంటేసుకొని ఈ టోర్నీలో పాల్గొన్న సానియా మూడు డబుల్స్ మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలను అందించింది. 2016 తర్వాత సానియా ఫెడ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. దక్షిణ కొరియా, ఇండోనేసియా, చైనీస్ తైపీ, ఉజ్బెకిస్తాన్, చైనా జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. 17 వేల మంది టెన్నిస్ అభిమానులు ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను ఎంపిక చేశారు.
సానియాతోపాటు క్వాలిఫయర్స్ విభాగంలో అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా), అమెరికా జోన్‌లో ఫెర్నాండా గోమెజ్ (మెక్సికో), యూరప్/ఆఫ్రికా జోన్‌లో అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) ‘ఫెడ్ కప్ హార్ట్’ అవార్డులు గెల్చుకున్నారు. క్వాలిఫయర్స్ విభాగం విజేతకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 27 వేలు)… మిగతా మూడు విభాగాల విజేతలకు 2 వేల డాలర్ల (రూ. లక్షా 51 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. అయితే ఈ ప్రైజ్‌మనీని విజేతలు తమకు నచ్చిన చారిటీ సంస్థకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.
తొలి భారతీయురాలిగా ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెల్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదో పెద్ద గౌరవం. ఈ అవార్డును దేశానికి, నా అభిమానులకు అంకితం ఇస్తున్నాను. భవిష్యత్‌లోనూ భారత్‌కు నేను మరెన్నో విజయాలు అందిస్తానని ఆశిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా లభించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నాను.