వలస కూలీలను తమ సొంతూళ్లకు తరలించే క్రమంలో పోలీసులు, టీఆర్ఎస్ నాయకులతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు వాగ్వాదానికి దిగారు. ఇలాంటి సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు డీఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో వీహెచ్‌ను అరెస్ట్ చేశారు.
అయితే ఒడిశాకు చెందిన కార్మికులను తమ సొంత ఊళ్లకు పంపించడానికి కాంగ్రెస్ నాయకులు మూడు ప్రైవేటు బస్సులను మాట్లాడి.. వాటికి అనుమతి తీసుకున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. అలాగే.. పట్టణ శివారులో సుమారు 60 మంది కార్మికులు ఉండటంతో పోలీసులు ఒక బస్సుకు డ్రైవర్ కాకుండా ఏడుగురినే తరలించేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వీహెచ్.. ‘కేటీఆర్.. ఇదేం దాదాగిరి.. ఇదేం ప్రజాస్వామ్యం.. కాంగ్రెసోళ్ల.. సాయం చేయొద్దా.. చేస్తే.. తప్పా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే.. పోలీసులతో కలిసి అధికార పార్టీ నాయకులు వలస కార్మికులను సొంతూళ్లకు పంపించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. కాగా కాసేపటి తర్వాత టీఆర్ఎస్ నాయకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆయన పరుష పదజాలం వాడారంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. దీంతో డీఎస్పీ చంద్రశేఖర్, టౌన్ సీఐ వెంకటనర్సయ్య సమక్షంలో పోలీసులు వీహెచ్‌ను అరెస్ట్ చేశారు.